గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పాత పోలవరం గ్రామానికి ప్రమాదం పొంచి వుంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి గట్టు కోతకు గురవుతోంది. గత సంవత్సరం వరదల్లో కొంతమేర కోతకు గురైన గట్టు ఈ ఏడాది వరదలకు మరింత బలహీన పడుతోంది. మరో మీటరున్న గోదావరి పెరిగితే గండిపడే ప్రమాదం ఉందని పోలవరం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాత పోలవరం గట్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పోలవరం గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలవరంలోని ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
గోదావరికి వరద పోటు పెరుగుతుండటంతో పోలవరం గట్టు 50 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. మీటరున్నర గనుక గోదావరి వరద పెరిగినట్లైతే పోలవరంలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం వచ్చిన వరదలకు గట్టు దాదాపు సగం వరకు కోతకు గురైంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా కోతకు గురవుతుంది. దీన్ని జిల్లా కలెక్టర్ తోపాటుగా ఇరిగేషన్ అధికారులు, ఉన్నతాధికారులు పరిశీలించారు.
పాత పోలవరంలో గోదావరి వరద వచ్చే అవకాశం ఉండటం దీనికి తోడు మూడు చోట్ల గట్టు బలహీనంగా ఉందని అధికారులు, నిపుణులు తేల్చడంతో పాత పోలవరం చెందిన గ్రామస్థులంతా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీనికి తోడు ఒక మీటరున్నర గనుక పెరిగినట్లైతే గోదావరి గట్టుకు కచ్చితంగా గండిపడుతుందని ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు.
ఇప్పటికే దాదాపు 300 ఎకరాలకు పైగా పంట మునిగిపోయింది. దీనికి తోడు గ్రామం మొత్తాన్ని ఒక్కసారిగా ఖాళీ చేయించాలంటే దాదాపు 5 వేలకు పైనే ప్రజలుంటారు. వీరందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నా అధికారులకు కష్టం. ప్రస్తుతం నిన్నటి నుంచి గోదావరి వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది.
ముందునుంచి కోతకు గురవుతుందని గమనించిన అధికారులు ముందస్తుగానే గ్రామస్తులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ గ్రామాన్ని ఖాళీ చేసే వెళ్లాలంటే కోవిడ్ అనే భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు స్థానికంగా ఉన్న స్కూల్స్, కొన్ని లాడ్జీలను అరెంజ్ చేశారు. రెండు కళ్యాణ మండపాలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మొత్తం జనాభాను పూర్తిస్థాయిలో తరలించాలంలే అధికారులకు సాధ్యపడే అవకాశం లేదు.
కానీ ఒక్కసారి కనుక గండి పడినట్లైతే ఉధృతంగా వస్తున్న వరదకు మొత్తం పాత పోలవరంతోపాటుగా కొత్త పోలవరం కూడా మునిగిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు గ్రామాన్ని అంతా ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ ఖరాకండిగా ఆదేశాలు జారీ చేశారు. మరి కోవిడ్ నేపథ్యంలో వీటిని మరింత విస్తృతంగా పెంచుతారా లేదా అనేది చూడాలి.