Monsoon Rains: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. ఇవాళ అండమాన్‌కు.. ఏపీ, తెలంగాణలోకి ఎప్పుడంటే? ఐఎండీ కీలక ప్రకటన ..
Southwest Monsoon Rains: :ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా జూన్ 1వ తేదీకి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశం ఉంది. ఇవాళ లేదంటే రేపు నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- May 16, 2026 / 11:09 AM IST
India Meteorological Department Has Predicted Southwest Monsoon Rains Will Hit The Kerala State By May 26
- చల్లటి కబురు చెప్పిన ఐఎండీ
- ఈనెల 26న కేరళను తాకనున్న నైరుతి రుతు పవనాలు
- జూన్ 1 లేదా 3 మధ్యలో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ
Monsoon Rains : ఏపీ, తెలంగాణలోని ప్రజలకు శుభవార్త. ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నట్లు పేర్కొంది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగా వస్తున్నాయని ఐఎండీ పేర్కొనడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా జూన్ 1వ తేదీకి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశం ఉంది. ఇవాళ లేదంటే రేపు నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. గతేడాది వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే.. మే 24వ తేదీన కేరళను రుతుపవనాలు తాకాయి. మే31వ తేదీ నాటికి తెలంగాణను పలుకరించాయి. ప్రస్తుతం అంచనా ప్రకారం.. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూన్ 4తేదీల మధ్యలో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రుతుపవనాలు మొదటి దశలో అంటే జూన్ నుంచి జులై ప్రారంభంలో స్థిరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో బలపడి, దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
రుతుపవనాల కారణంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఈవారం భారీ నుంచి అతిభారీ వర్సాలు కురిసేఅ వకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో మే 19వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ భారతదేశాన్ని పలుకరించిన తరువాత ఈ రుతుపవనాలు నెల రోజుల్లోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. అయితే, ప్రస్తుతం రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. అయితే, తెలంగాణలో మాత్రం ఈనెల 18వ తేదీ వరకు వేడి గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా అంచనా వేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
