ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌కు కూటమి సర్కార్ బిగ్ షాకిచ్చింది. సునీల్ మీద అభియోగాల కథేంటో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. వైసీపీ హయాంలో సీఐడీ విభాగం అధిపతిగా అడ్డగోలుగా వ్యవహరించిన సునీల్ కుమార్ ఎన్నో ఆరోపణలు, మరెన్నో అలిగేషన్స్ ఉన్నాయి. ఆయనపై చర్యలుంటాయంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది.
ఎట్టకేలకు సునీల్ మీద ఉన్న అభియోగాలపై వాస్తవాలేంటో తేల్చేందుకు..విచారణ అథారిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ అథారిటీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో..
నకిలీ డిపాజిటర్లను సృష్టించి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన సొమ్మును సునీల్ రూ.లక్షలు స్వాహా చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో జమ చేసిన నిధులను సునీల్‌కుమార్, ఆయన సన్నిహితుడు కామేపల్లి తులసిబాబుతో కలిసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాపట్ల జిల్లా రామకూరులోని 96 మంది నకిలీ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో సొమ్ము జమ చేసి..వారి నుంచి రూ.15 వేలు నుంచి రూ.20 వేలు చొప్పున వసూలు చేశారని అలిగేషన్స్ చేశారు. ప్రకాశం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో 400 మంది దగ్గర కూడా ఇలాగే తీసుకున్నారని చెప్పారు.
ఇక సీఐడీలో టెక్నాలజీ పేరుతో రూ.75లక్షలు నొక్కేశారని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో మెన్షన్ చేశారు రఘురామకృష్ణరాజు. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ తరచూ దుబాయ్‌కి వెళ్లి బినామీలతో కలిసి కుమారుల పేరుతో సునీల్ కుమార్ అక్కడ వ్యాపారాలు చేస్తున్నట్లు కంప్లైంట్‌లో ఆరోపించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో సునీల్ చేసిన అరాచకాలపై ఇప్పటికే కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది.
సునీల్‌పై పలు ఫిర్యాదులు..
అమాయకులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతిపరులను వదిలేశారంటూ సునీల్‌పై పలు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు సునీల్ కుమార్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, ఆయనపై అభియోగాలను విచారించి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని తెలిపింది సర్కార్.
సీఐడీ కస్టడీలో నాటి వైసీపీ ఎంపీ రఘురామరాజును టార్చర్ చేసినవారిలో కామేపల్లి తులసిబాబు కూడా ఉన్నారన్న ఆరోపణలపై ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తులసిబాబు కీలక అంశాలు చెప్పినట్లు తెలుస్తోంది. అందులో సునీల్ అక్రమాల వివరాలు కూడా ఉండటంతో..పోలీసులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారట.
దీంతో ఇప్పటికే సీఐడీ మాజీ చీఫ్‌పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… రఘురామ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సునీల్‌పై చర్యలకు సిద్ధమవుతోందట. అయితే సునీల్‌పై నమోదైన ప్రతి అభియోగం వాస్తవమా కాదా అనేది తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సునీల్ అరెస్ట్ ఖాయమన్న పోలీస్ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి.
Chandrababu Naidu: మంత్రులు, ఎంపీలకు క్లాస్ పీకిన చంద్రబాబు!