బాబోయ్.. నిన్న కప్ప, నేడు పిల్లి.. నాగార్జున యూనివర్సిటీ ఘటనపై మంత్రి లోకేశ్‌ సీరియస్‌..

మెస్ లో ఆహార నాణ్యతపై ఇప్పటికే వర్సిటీ రిజిస్ట్రార్ కు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు.

Acharya Nagarjuna University Incident : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. వర్సిటీలోని వసతి గృహంలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. సాంబారులో కప్ప రావడంతో భోజనం మానేసినట్లు విద్యార్థులు తెలిపారు. దీనిపై వార్డెన్ కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. రాత్రి భోజనం చేద్దామని హాస్టల్ మెస్ కు వెళితే.. అక్కడ ఓ పిల్లి పెరుగు తాగుతూ కనిపించిందని, అదే పెరుగును తమకు వడ్డిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. దీనిపై విద్యార్థులు వార్డెన్ ను ప్రశ్నించగా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ వార్డెన్ వెంకటరత్నకుమారి తమతో దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు వీసీ చాంబర్ వద్ద ధర్నాకు దిగారు.

ఇప్పటికే వర్సిటీ రిజిస్ట్రార్ కు మెస్ లో ఆహార నాణ్యతపై అనేకసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో తినే ఆహారంలో ఒకసారి ఈగలు, మరోసారి దోమలు, బొద్దింకలు కనిపించాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా కప్ప కనిపించిందన్నారు. పెరుగు తాగుతూ పిల్లి కనిపించిందని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భారీ ఆందోళనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్ట్రార్, వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అలర్ట్ అయిన పోలీసులు, అధికారులు యూనివర్సిటీకి వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడారు. వారిని హాస్టల్ నుంచి పంపే ప్రయత్నం చేశారు.

నాగార్జున యూనివర్సిటీలో సాంబారులో కప్ప రావడం, పిల్లి పెరుగు తాగిన ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల ఆందోళనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన వార్డెన్ ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డెన్ పై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు లోకేశ్.

 

Also Read : దటీజ్ పవన్ కల్యాణ్..! ఢిల్లీ నుంచి గల్లీ వరకు సేనాని దూకుడు, దేశం కళ్లన్నీ పవన్ వైపే..!