Visakha Gajuwaka
Intermediate girl murdered : విజయవాడ దివ్య తేజస్విని ఘటన మరవకముందే ఏపీలో మరో ప్రేమోన్మాదం వెలుగులోకి వచ్చింది. విశాఖ గాజువాకలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాదానికి ఓ మైనర్ బాలిక బలైంది. వరలక్ష్మి అనే బాలిక గొంతు కోశాడో ప్రేమోన్మాది. కత్తితో కోయడంతో..ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా…ఫలితం లేకుండా పోయింది. మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది.
ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన వరలక్ష్మికి, లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న అఖిల్‌తో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమెకు దగ్గరైన అఖిల్..ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి…ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన రాము అనే యువకుడి ద్వారా ఫోన్ చేయించిన అఖిల్…సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్‌ను నిలదీయగా..మాట్లాడాలి రా అంటూ సాయిబాబా టెంపుల్ కొండమీదికి తీసుకెళ్లాడు.
అక్కడి పరిస్థితిని గమనించిన వరలక్ష్మి…ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన అఖిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నరికాడు. చెల్లెలు ఏదో ప్రమాదంలో చిక్కుకుని ఉంటుందని భయపడిన ఆమె సోదరుడు..తండ్రితో కలిసి వెంటనే అక్కడికి చేరుకునేసరికి…యువతి ఆలయ మెట్లపై రక్తపు మడుగులో కనిపించింది.
అయితే అప్పటికే రాము అక్కడి నుంచి పరారయ్యాడు. మెట్లు దిగి వస్తున్న అఖిల్‌సాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొనఊపిరితో ఉన్న యువతిని కారులో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వరలక్ష్మి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు పోలీసులు.
అప్పటి వరకు తమతో ఉన్న వరలక్ష్మి…విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు అఖిల్ పక్కా ప్లాన్‌తోనే వరలక్ష్మిని హత్యచేశాడంటున్నారు బంధువులు. అఖిల్‌ను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.