వైసీపీ నేతల అరెస్ట్‌ల పర్వం కంటిన్యూ అవుతున్న వేళ.. నెక్ట్స్ ఎవరు అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ విచారణ పూర్తవగా.. భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రోజాకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం మొదలైంది. ఇంతకీ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఏం జరిగింది.. విజిలెన్స్‌కు ఎలాంటి ఆధారాలు లభించాయ్.. రోజా అరెస్ట్ ఖాయమా.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గాసిప్స్ ఏంటి?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 డిసెంబర్‌లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. 125 కోట్లలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 47రోజుల పాటు నిర్వహించారు. ఐతే ఈ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించాయ్. ఐతే దీనిపై విచారణ జరిపిన విజలెన్స్.. కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది కూటమి ప్రభుత్వం. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి రోజా చుట్టు ఉచ్చు బిగుసుకునేలా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలకు ముందు యువ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో.. వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టిందనే ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయ్. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి… విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ షర్టులు పంపిణీ చేసింది. విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం 2.7 కోట్లు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్లు, పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయ్.
ఐతే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. క్రీడా పరికరాల కొనుగోలులో కమీషన్లు, నాసిరకం కిట్ల పంపిణీ, నకిలీ విజేతలకు నగదు బహుమతులు, వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడంలాంటి అనేక అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయ్. 2024 ఎన్నికలకు ముందు.. దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటి క్రీడల మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని టార్గెట్ చేసుకొని.. ప్రతిపక్షం భారీగా విమర్శలు గుప్పించింది. అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరుపుతామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కూటమి.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్
విజయవాడలోని శాప్ కార్యాలయంతో పాటు జిల్లా క్రీడా సంస్థలలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రీడా పరికరాల కొనుగోలు, పోటీల నిర్వహణ, నగదు బహుమతుల కేటాయింపులాంటి అన్ని అంశాలను పరిశీలించిన విజిలెన్స్.. 40కోట్ల వరకు నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
రేపోమాపో ఈ నివేదికను డీజీపీకి సమర్పించేందుకు రెడీ అవుతోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోందని సమాచారం. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయ్. క్రీడల్లో వైసీపీ నేతలు చెప్పినవాళ్లనే విజేతలుగా ప్రకటించారనే విమర్శలు వినిపించాయ్. వర్క్ ఆర్డర్లను అప్పటి మంత్రి ఆర్కే రోజా, మాజీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పినవారికే ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయ్. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తుండగా.. ఇప్పుడు విలిజెన్స్ నివేదిక కీలకంగా మారింది.
విజిలెన్స్ విచారణతో కొందరు అధికారుల్లో ఆందోళన
ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత.. మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పాటు మరికొందరు అధికారులపై కేసులు నమోదు కావచ్చని.. అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయ్. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైనా.. అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది.
ఇక అటు విజిలెన్స్ విచారణ ముగియడంతో.. కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అదే జరగబోతుందా అనే టెన్షన్ కొందరిలో కనిపిస్తోంది. ఏమైనా విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటే… ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.