ఏపీ సెంట్రిక్‌గా బీజేపీ అసలు సిసలు రాజకీయానికి తెరలేపుతోంది. రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్న కమలం పార్టీ..అదును చూసి అడుగులు వేస్తోందట. అపోజిషన్‌లో ఉన్న వైసీపీకి వరుస పెట్టి గుడ్‌బై చెప్తున్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు. 11 మంది ఉంటే ఇప్పుడు పెద్దల సభలో ఫ్యాన్ పార్టీ బలం ఏడుకు తగ్గింది.
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అందులో టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏపీలో వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం, కూటమి పార్టీలకు 160కి పైగా శాసనసభ్యులు ఉండటంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే చాలు అది కూటమి పార్టీల ఖాతాలో పడిపోతుంది.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, కృష్ణయ్య రిజైన్ చేశారు. వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అందులో రెండు పదవులను టీడీపీ తీసుకుంది. ఒక పదవి బీజేపీకి విడిచిపెట్టింది.
ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం మూడు పార్టీలు పట్టుబడుతున్నాయి. రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన సభ్యుల స్థానాల విషయంలో పంపకాలు జరుగుతున్నాయి. కానీ మొత్తం బీజేపీ ఖాతాలోకి చేరడం లేదు.
కొత్త ఆలోచనను తెరపైకి?
దీంతో ఇప్పుడు కమలం పార్టీ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చిందట. 2019లో టీడీపీ పార్టీ ఓడిపోయినప్పుడు..అప్పుడు రాజ్యసభలో ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండేవారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌తో పాటు మరొకరు బీజేపీలో చేరిపోయారు. తమ పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
కనకమేడల రవీంద్రబాబు మాత్రమే టీడీపీలో ఉండిపోయారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే బెటరనే ఆలోచనకు బీజేపీ వచ్చిందట. వైసీపీ ఎంపీల రాజీనామాతో..ఖాళీ అవుతున్న సీట్లను కూటమిలోని మూడు పార్టీలు పంచుకుంటున్నాయి. అదే విలీన ప్రక్రియతో అయితే సభ్యులు రిజైన్ చేయాల్సిన పని ఉండదు. అందరూ బీజేపీ ఖాతాలోకి వచ్చేస్తారని ప్లాన్ చేస్తున్నారట.
మరోవైపు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కూటమి పార్టీలు కొత్త అభ్యర్ధులను పెట్టుకుని రాజ్యసభలో బలం పెంచుకుంటున్నాయి. దాంతో జంప్ అవుదామనే ఆలోచనలో ఉన్న కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా మౌనంగా ఉండిపోతున్నారట. తమ పదవులకు ఎలాంటి ఢోకా లేకుంటే పార్టీ కండువా మార్చుకోవడానికి సిద్ధమంటున్నారట. ఇదే అదునుగా తమ వ్యూహాలకు పదును పెట్టిందట కమలం దళం.
పార్టీలో ఎందరు ఉంటారో?
ఇప్పుడు రాజ్యసభలో వైసీపీకి ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఎందరు పార్టీలో ఉంటారో ..ఎవరు వీడుతారోనన్నది హాట్ డిస్కషన్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్‌రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినా ఆయన అదానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే అనధికారికంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశముంది.
ఆ ఆరుగురిలో జగన్ వెంట నడిచేది ఎవరనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డి మాత్రమే వైసీపీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు బాబాయి కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అలాగే గొల్ల బాబూరావు కూడా తొలి నుంచి జగన్‌కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లబోరని చెబుతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. నమ్మకస్థుడు కూడా. ఆయన పార్టీ మారే చాన్స్ లేదంటున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది. జగన్ కేసులన్నీ ఆయనే చూస్తున్నారని చెప్పుకొస్తున్నారు.
అయోధ్య రామిరెడ్డి విషయంలోనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఆయన పారిశ్రామికవేత్త. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో వైరం పెంచుకోవద్దని అనుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. వ్యాపారాలకు ఇబ్బందులు తెచ్చి పెట్టుకోవద్దన్న ఆలోచనలో ఆయన ఉన్నారట. అందుకే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్యరామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఇక మేడా రఘునాధరెడ్డి పదవీ కాలం 2030 వరకూ ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు.
అయితే బీజేపీ రంగంలోకి దిగి ఎంతమందితో వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. విలీనం అంటూ జరిగితే వైసీపీలో ఎందరు మిగులుతారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. రాజ్యసభలో వైసీపీకి ఎవరూ మిగలరని కూటమి నేతలు ఇప్పటికే జోస్యం చెప్తున్నారు. జగన్‌కు చిన్నాన్న కాబట్టి వైవీ సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతారా లేక ఇంకా ఎవరైనా ఉంటారా అన్నది వేచి చూడాలి మరి.