Saudiarabia Telugu Family
Saudiarabia Telugu Family : సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా నివసించే హరాలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ కుటుంబం దారుణ హత్యకు గురైంది. వీరు కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. గాలి రవి (49), గాలి శ్రీదేవి (43) దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు యెజ్ర ప్రభాకర్. 12వ తరగతి చదువుతున్నాడు. వారంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే, గురువారం ముగ్గురు హత్యకు గురైయ్యారు. కొడుకు ప్రభాకర్ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై తల్లిదండ్రులను హత్యచేశాడని, ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఇండియాలోని వారి బంధువులు ఖండించారు.
ఇండియాలోని మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన గాలి రవి, గాలి శ్రీదేవి దంపతుల కుమారుడు యెజ్ర. అతను 12వ తరగతి చదువుతున్నాడు. ఆ దంపతులకు అతడు ఒక్కడే కొడుకు. ఆ కుటుంబం అందరితో కలసి మెలసి జీవనం సాగిస్తుండేది. రవి, శ్రీదేవి దంపతులతో వారి కొడుకు యెజ్ర చాలా బాగుండేవారని స్థానికులు చెప్తున్నారు. ఇక రవి రియాద్‌లోని ఒక SAICO ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ నెట్ వర్క్ ఇంజినీర్ గా, తల్లి శ్రీదేవి డిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మృతులు స్థానికంగా అందరితో కలసిమెలసి ఉండేవారని తెలిపారు. యెజ్ర స్థానిక డిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం సీబీయస్ఈ వార్షిక పరీక్షలు కూడా రాస్తున్నాడు.
యెజ్ర అదే స్కూల్‌లో చదువుతున్న జోర్డాన్‌కు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని బంధువులు తెలిపారు. తొలుత ఆ అమ్మాయి కూడా యెజ్ర అంటే ఇష్టపడిందని చెప్పారు. ఆ తర్వాత ఆ అమ్మాయి యేజ్రాను దూరం పెట్టిందని అన్నారు. ఈ క్రమంలో యెజ్ర తన వద్ద ఉన్న పోటోలను అమ్మాయి తల్లితండ్రులకు పంపాడని, ఈ విషయం తెలిసి అమ్మాయి తల్లితండ్రులు దాదాపు నెల క్రితం యెజ్ర సహా రవి, శ్రీదేవిలను బెదిరించారని బంధువులు తెలిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదని చెప్పారు.
గురువారం గుర్తు తెలియని నిందితులు ముందు రవి, శ్రీదేవిలను దారుణంగా హత్య చేశారని, రవి ఒంటిపై 30కి పైగా కత్తిపోట్లు తెలిపారు. ఆ తర్వాత యెజ్ర ను ఇంకో చోటుకు తరలించి ఎత్తైన మేడపై నుంచి తోసి చంపివేశారని వారు ఆరోపించారు. ఆ తర్వాత తల్లిదండ్రులను యెజ్ర హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేశారని వారు వాపోయారు. ఇప్పటికీ మృతదేహాలను కూడా చూడనీయడం లేదన్నారు. యెజ్రకు తల్లితండ్రులు అంటే ఎంతో ప్రాణమని, ఇంత దారుణంగా ఎందుకు హత్య చేస్తాడని ప్రశ్నించారు.
రియాద్ నగరంలోని ఆ ప్రాంతంలో చుట్టూ పక్కల నివసించే వారు కూడా యెజ్ర గురించి చెప్తూ బాగా ఉండేవాడని, అందరితో కలసి ఉండేవాడని చెప్పారని బంధువులు తెలిపారు. హత్య చేస్తే కనీసం షర్ట్ పై రక్తపు మరకలైన ఉంటాయి కదా అని వారు ప్రశ్నించారు. గత క్రిస్మస్ కు ఇండియాకు వచ్చిన వారు అందరితో ఆనందంగా గడిపారని కానీ ఇంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటన పై సౌదీ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. నెల రోజుల్లో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలన్నారు. యెజ్ర వాట్సప్ చాట్ పై విచారణ జరిపితే అన్ని విషయాలు తెలుస్తాయని వారు అన్నారు. భారత ఎంబసీ అధికారులు వెంటనే ఈ. విషయంలో తమకు సహాయం అందించాలని మృతుల బంధువులు అభ్యర్థించారు.