Afghanistan vs Pakistan : అఫ్గాన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన పాక్.. ఇరు దేశాల్లో ఎవరి సైనిక బలం ఎంతటే? ఫుల్ డీటెయిల్స్
Afghanistan vs Pakistan War : అఫ్గానిస్థాన్ - పాకిస్థాన్ దేశాల మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. గజీబ్ లిల్ హాక్ పేరుతో పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది.
Afghanistan vs Pakistan
- అఫ్గాన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన పాకిస్థాన్
- అఫ్గాన్ ప్రధాన నగరాలపై వైమానిక దాడులు
- యుద్ధం వేళ పాక్, అఫ్గాన్ సైనిక సామర్థ్యం చర్చ
- అన్ని విభాగాల్లో మెరుగ్గా పాకిస్థాన్
Afghanistan vs Pakistan : అఫ్గానిస్థాన్ – పాకిస్థాన్ దేశాల మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. గజీబ్ లిల్ హాక్ పేరుతో పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ దేశ రాజధాని కాబూల్ పై పాక్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. అఫ్గాన్ సైతం పాకిస్థాన్ పై దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే.. ఏ దేశం పైచేయి సాధిస్తుంది.. సైనిక, ఆయుధ సామాగ్రిలో ఏ దేశం ఏ స్థానంలో ఉందనే విషయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గ్లోబల్ పైర్పవర్ ఇండెక్స్ ప్రకారం.. పాకిస్థాన్ 145 దేశాల్లో సైనిక, ఆయుధ సామాగ్రిలో 14వ స్థానంలో ఉంది. అదే.. అఫ్గానిస్థాన్ మాత్రం 121వ స్థానంలో ఉంది. దీన్నిబట్టి చూస్తే అఫ్గాన్ తక్కువ సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్ సైనిక సామర్థ్యం క్షీణించిందని, అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడం వల్ల ఆధునిక ఆయుధాల విషయంలో పరిమిత సామర్థ్యం కలిగి ఉందని రాయిటర్స్ నివేదించింది.
లండన్ కు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం.. పాకిస్థాన్ సాయుధ దళాలు ఎప్పటికప్పుడు నియామకాలు, చైనా నుంచి వచ్చే పరికరాలతో సహా నింతర పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతున్నాయి.
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ ప్రకారం.. పాకిస్థాన్ లో దాదాపు 6,60,000 మంది క్రియాశీల సైనిక సిబ్బంది ఉన్నారు. వీరిలో దాదాపు 5,60,000 మంది సైన్యంలో, 70వేల మంది వైమానిక దళలో, 30వేల మంది నావికాదళంలో ఉన్నారు. దీనికితోడు 5,50,000 మంది రిజర్వ్ సిబ్బంది, 5లక్షల మంది పారా మిలిటరీ దళాలు కూడా ఉన్నాయి. అఫ్గాన్ దేశానికి సైనిక బలం తక్కువగానే ఉంది. నివేదికల ప్రకారం.. 1,72,000 మంది క్రియాశీలక సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్యను 2లక్షలకు విస్తరించాలని ప్రణాళికలను అప్గాన్ సిద్ధం చేసుకుంది. జనాభా పరంగా పాకిస్థాన్ దేశంలో 252 మిలియన్లకుపైగా ఉంటే.. అఫ్గాన్ దేశంలో దాదాపు 40 మిలియన్ల మంది ఉన్నారు.
వైమానిక శక్తిలోనూ పాకిస్థాన్ మెరుగ్గా ఉంది. పాకిస్థాన్ వైమానిక దళంలో మొత్తం 1,397 విమానాలు ఉన్నాయి. వాటిలో 331 ఫైటర్ జెట్లు, 90 డెడికేటెడ్ అటాక్ ఎయిర్ క్రాప్ట్ లు, 389 హెలికాప్టర్లు, 55 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. అదే అఫ్గానిస్థాన్ వద్ద కనీసం ఆరు విమానాలు, 23 హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు సోవిట్ యుగం నాటివి. దీంతో పాకిస్థాన్‌కు సరిహద్దు కార్యకలాపాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
పాకిస్థాన్ వద్ద 2,677 ట్యాంకులు, 59,000 కంటే ఎక్కువ సాయుధ వాహనాలు, 662 స్వయం చోదక ఫిరంగి యూనిట్లు, 2,629 టోవ్డ్ ఫిరంగులు, 652 మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వద్ద దాదాపు 3,902 సాయుధ వాహనాలు ఉన్నాయి. పాకిస్తాన్ 170 న్యూక్లియర్ వార్హెడ్లను కలిగి ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.
రక్షణ వ్యయంలోనూ పాకిస్థాన్, అఫ్గాన్ దేశాల మధ్య అంతరం ఎక్కువగానే ఉంది. పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ దాదాపు 9.1 బిలియన్ డాలర్లు (ప్రపంచ వ్యాప్తంగా 38వ స్థానం) గా ఉంది. మరోవైపు.. అఫ్గానిస్థాన్ రక్షణ బడ్జెట్ కేవలం 145 మిలియన్ డాలర్లు (ప్రపంచ వ్యాప్తంగా 136వ స్థానం) గా ఉంది. అన్ని విభాగాల్లోనూ అఫ్గానిస్థాన్ కంటే పాకిస్థాన్ మెరుగైన స్థితిలో ఉంది.
