Jada Sravan Kumar
Jada Sravan Kumar – Andhra Pradesh: పాదయాత్ర చేసే హక్కు వైఎస్ ఫ్యామిలీకే ఉందా అని జై భీమ్ భారత్ పార్టీ (Jai Bheem Bharat Party) అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) గతంలో జైల్లో ఉన్న సమయంలో ఆయన వదిలిన బాణం వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్ర చేయలేదా? అని అన్నారు. ఆ సమయంలోనూ ఇలాగే పోలీసులు ఆంక్షలు విధించారా అని ప్రశ్నించారు. తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని శ్రవణ్ కుమార్ అడిగారు.
ఇవాళ శ్రవణ్ కుమార్ విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్ పాదయాత్ర చేసిన సమయంలో సభలు నిర్వహించలేదా? అని అన్నారు. తాము పాదయాత్రలు చేస్తుంటే ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతున్నారంటూ మండిపడ్డారు. తాము శనివారం చేయబోయే పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటే శాంతియుతంగా ప్రతిఘటిస్తామని చెప్పారు.
రాజధానిలోని తుళ్లూరు అంబేద్కర్ విగ్రహం నుంచి శాఖమూరు అంబేద్కర్ స్మృతివనం వరకు తమ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక అమరావతిపై ఆర్థిక, సామాజిక దాడి చేశారని మండిపడ్డారు. 55 శాతం భూమి ఇచ్చింది బడుగు, బలహీనవర్గాలు మాత్రమేనని అన్నారు.
అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉండగా జగన్ వాటిని అడగకుండా కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయ్యారంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై కక్షతోనే అమరావతికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.