jagananna vidya kanuka: జగనన్న విద్యాకానుకను ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో గురువారం(అక్టోబర్ 8,2020) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, చదువే తరగని ఆస్తి అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని నెల్సన్ మండేలా అన్నారని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 34శాతం మంది చదువు రానివారు ఉన్నారని జగన్ అన్నారు. విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
మన బడి, నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టామని, వాటి ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని జగన్ అన్నారు. ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లలకు రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇది జరగాలంటే సమూల మార్పులు తీసుకురావాలన్నారు. క్లాస్ రూమ్ లను విద్యార్థులకు సౌకర్యంగా తీర్చిదిద్దామని సీఎం జగన్ తెలిపారు.
జగనన్న విద్యాకానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 42లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కిట్లు పంపిణీ చేయనుంది. విద్యాకానుక కోసం ప్రభుత్వం రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యాకానుక కింద ఒక్కో విద్యార్థికి 3జతల యూనిఫామ్, పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, ఒక జత షూ, మూడు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ఇస్తారు. విద్యాకానుకతో రాష్ట్రవ్యాప్తంగా 42లక్షల 34వేల 322మంది విద్యార్థులకు లబ్ది కలగనుంది. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిట్లు ఇస్తారు. ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూల్స్ తెరుచుకోనున్నాయి.