Pawan Kalyan : చంద్రబాబుకు బెయిల్ మంజూరు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జనసేనాని ఏమన్నారంటే..

Pawan Kalyan..Chandrababu Bail

Pawan Kalyan..Chandrababu Bail : చంద్రబాబు ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలి అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులుగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు.

చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన జైలు నుంచి విడుదల కోసం కోట్లాదిమంది ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం అని అన్నారు. చంద్రబాబు ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం అంటూ పేర్కొన్నారు. పవన్ స్పందనకు సంబంధించి జనసేన పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది.

కాగా చంద్రబాబు అరెస్టుకు ముందు ఆ తరువాత అన్నట్లుగా మారింది టీడీపీ,జనసేన పార్టీల బంధం.చంద్రబాబు అరెస్టుకు ముందు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ఊహాగానాలే తప్ప ఇరు పార్టీల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. కానీ చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతో కలిసి బాబుతో ములాఖత్ అయ్యారు. అనంతం జైలు వెలుపలే మీడియా సమావేశంలో పవన్ టీడీపీ, జనసేన పొత్తు విషయంలో బాంబు పేలుస్తు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ‘‘అవును టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయి’’అంటూ కుండ బద్దలు కొట్టారు.దీంతో అప్పటి వరకు కేవలం ఊహాగానాలకే పరిమితమైన పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

చంద్రబాబు జైలు నుంచే ఇచ్చే సూచనలను బయట పార్టీ నేతలు..కుటుంబ సభ్యలు అమలు చేసేవారు. ఆయన సూచనల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. బాబుతో ములాఖత్ తరువాత  ఇరు పార్టీలు కలిసే కార్యక్రమాలు నిర్వహించటం మొదలుపెట్టాయి. ఇదంతా చంద్రబాబుతో ములాఖత్ లో ఇరు పార్టీల అధినేతలు కలిసి కీలక విషయాలు చర్చించుకోవటం వల్లే జరిగినట్లుగా క్లారిటీ వచ్చింది. ఇరు పార్టీల పొత్తుల నిర్ణయాలకు చంద్రబాబు అరెస్ట్ ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా నిలిచినట్లైంది.