Jana Sena Party
Jana Sena Party : రాజకీయ పార్టీలకు, ప్రముఖులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు, ఫేస్‌బుక్ అకౌంట్లు పలు సందర్భాల్లో హ్యాకింగ్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. బాధితుల్లో అనేక మంది సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అయితే, తాజాగా.. జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకర్ల బారినపడింది. ఎప్పుడూ జనసేన పార్టీకి సంబంధించిన, పవన్ కల్యాణ్ ప్రోగ్రాంలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కనిపించే ఈ ట్విటర్ ఖాతాలో.. ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్‌కు సంబంధించిన రీ ట్వీట్స్ కనిపించడంతో ఫాలోవర్లు అవాక్కయ్యారు.
జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (గతంలో ట్విటర్) హ్యాండిల్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. సైబర్ క్రైం అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఖాతా పునరుద్దరణ కోసం సాంకేతిక బృందం చర్యలు చేపట్టినట్లు సమాచారం. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉంది.
నిత్యం పొలిటికల్ పోస్టులు కనిపించే జనసేన హ్యాండిల్లో హ్యాకింగ్‌కు గురైన తర్వాత ఇన్వెస్ట్ మెంట్స్, ట్రేడింగ్స్ సంబంధించిన రీ ట్వీట్ చేసిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇది చూసిన పార్టీ అభిమానులు, శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ హ్యాకింగ్ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాకయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పార్టీకి సంబంధించిన వీడియోలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలు, సమావేశాలు ఉండటంతో పార్టీ యూట్యూబ్ ఛానల్ పుల్ యాక్టివ్ గా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఆ యూట్యూబ్ ఛానల్ లో జనసేన పార్టీకి చెందిన వీడియోలను తొలగించిన హ్యాకర్లు.. బిట్ కాయిన్ వీడియోలు అప్లోడ్ చేశారు. జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించి.. మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేశారు. తాజాగా.. ఇప్పుడు జనసేన ట్విట్టర్ ఖాతా హాక్ కావడం చర్చనీయాంశంగా మారింది.