జగన్ రెడ్డిగారూ.. అవమానించకండి : పవన్ కళ్యాణ్

  • Publish Date - November 19, 2019 / 04:37 AM IST

ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య భాష గురించి మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై విపక్షాలు విమర్శలు అధికార పక్ష నాయకుల ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జగన్ రెడ్డి గారూ..భాషా సరస్వతిని అవమానించకండి అంటూ..చదువులు తల్లి సరస్వతీ దేవి ఫోటోను పోస్ట్ చేశారు.

‘మా తెలుగు తల్లీ అంటూ పాడాల్సిన మీరు ‘తెలుగు తల్లి’నే చంపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ…తెలుగు పేపర్ నడుపుతూ..తెలుగుని చంపేసే ఆలోచన..భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. మాతృభాషని మృత భాషగా మార్చకండి అంటూ సూచించారు పవన్ కళ్యాణ్. 

ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ..తెలుగుని మృత భాషగా కాకుండా  ఏమి  చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు’ జగన్ రెడ్డి గారు’ చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదేనని పవన్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు సూచించారు.