సీమలో సేనానీ : ప్రజా సమస్యలను పరిష్కరించరా – పవన్

  • Publish Date - February 13, 2020 / 05:55 PM IST

కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ సర్కార్‌ ఘోరంగా విఫలమైదన్న ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. పెన్షన్ల రద్దు నుంచి రాజధాని మార్పు వరకు పలు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు జనసేనాని. 

పవన్ కల్యాణ్‌ రెండు రోజుల కర్నూలు జిల్లా పర్యటన 2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారంతో ముగిసింది. మొదటి రోజు సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాన్న డిమాండ్‌తో ర్యాలీ జరిపిన జనసేనాని, రెండో రోజు గురువారం జిల్లాలోని స్థానిక సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చారు. కర్నూలులోని జోహరాపురం వంతెనను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌..  సమస్యలపై స్థానికులతో చర్చంచారు. తుంగభద్రా నదికి నీరు వస్తే మునిగిపోయే వంతెన సమస్య పరిష్కారంలో జగన్‌ సర్కార్‌ విఫలమైందనంటూ ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు జనసేనాని.

అసౌకర్యాల మయంగా ఉన్న బలహీనవర్గాల ఇళ్ల కాలనీని పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌.. బాధ్యతాయుతంగా పనిచేసే ప్రజాప్రతినిధులను ఎన్నుకోపోతే ప్రజా సమస్యలు పరిష్కారం కావన్నారు. కర్నూలులో పర్యటన తర్వాత ఎమ్మిగనూరు వచ్చిన పవన్‌కు రాయలసీమ విద్యార్థి జేఏసీ నుంచి నిరసన వ్యక్తమైంది. జనసేనాని రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ నిరసన తెలిపిన జేఏసీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌.. వారి సమస్యల పై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సామాజిక పెన్షన్లు రద్దు చేస్తున్న జగన్ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. మొత్తంమీద పవన్‌ రెండు రోజుల పర్యటన కర్నూలు జిల్లా జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందని పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు.