అబద్దాలు చెబుతున్నారంట : వైసీపీ సోషల్ మీడియాపై జనసేన కంప్లయింట్

వైసీపీ-జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్‌లో  రచ్చ లేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై జనసేన పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తమపై ఉన్నవి లేనివి అన్నీ కలబోసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్. ఈ మేర పార్టీ మీటింగ్ పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్.. వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు లీగల్ నోటీసులు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

సైబర్ క్రైం పోలీసులకు ఈ ప్రచారాలపై ఫిర్యాదు చేయాలని పార్టీకి ఆదేశించారు పవన్. అభిమానుల ముసుగులో అవకాశంగా తీసుకుని.. బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు యత్నించారంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. దీనిని పవన్ కల్యాణ్‌తో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు తప్పుపడుతున్నారు.

‘పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు 2వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ గా మార్చాలనే ప్లాన్ లో అమెరికాలోని తానా వర్గం ఉన్నట్టుగా సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి వాటికి.. చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి దానిని వైట్ గా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు’అని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్టు చేసింది.

దానికి కౌంటర్‌గా జనసేనకు చెందిన వ్యక్తి  ‘మీ ఆరోపణ నిజమైతే అధికారంలో ఉన్నారు కదా చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు @ysjagan గారు? ఎన్నాళ్ళు జనసేనను ఎదగనీకుండా తప్పుడు ఆరోపణలు చేస్తారు @YSRCParty ? జనసేన అంటే ఎందుకంత భయం?#ShamelessYSRCongress’ అంటూ సమాధానమిచ్చారు. ఇంతటితో ఆగక ఆ ట్వీట్‌పై స్పందిస్తూ సైబర్ క్రైం కేస్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు.

వీటితోపాటు ఇటీవలే పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో 130 కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్నారని.. పార్టనర్ ప్యాకేజీ అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇచ్చాయి. సినిమాలు ఏమీ చేయకుండా వందల కోట్ల రూపాయలతో ఇల్లు ఎలా కొంటారంటూ కూడా వ్యాఖ్యలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్. వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయటంపైనా జనసేన అభిమానులు, కార్యకర్తలు అగ్గిపై గుగ్గిలం అవుతున్నారు. వీటన్నింటిపైనా పోలీసులకు కంప్లయింట్స్ చేయనుంది జనసేన పార్టీ.