Rayalaseema Focus: రాయలసీమపై కూటమి పార్టీల స్పెషల్‌ ఫోకస్.. ఏంటీ స్పెషల్ ప్లాన్?

సభలో లక్ష మంది మహిళలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో రాయలసీమపై స్పెషల్ కాన్సంట్రేషన్‌ చేసి..స్థానిక హామీలను నెరవేర్చి, పెండింగ్ ప్రాజెక్టులకు ముందుకు సాగేలా చేస్తోంది.

Rayalaseema Focus: రాయలసీమపై కూటమి పార్టీల స్పెషల్‌ ఫోకస్.. ఏంటీ స్పెషల్ ప్లాన్?

Pawan and chandrababu

Updated On : September 8, 2025 / 8:39 PM IST

Rayalaseema Focus: సీమ.. అదో కోట. ఒకప్పుడు కాంగ్రెస్‌కు..తర్వాత వైసీసీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ప్రాంతం. 2019లో జగన్‌ను పవర్‌లోకి తీసుకురావడంలో..తిరిగి 2024లో కూటమి అధికారంలో రావడానికి ఆ 52 సీట్లే కీలకం. తూర్పు గోదావరి, పశ్చమగోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు వచ్చిన వారికే పవర్‌లోకి వస్తుంటారు.

కానీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటించేది మాత్రం సీమలో ఆ అసెంబ్లీ సీట్లు మాత్రం చెప్పొచ్చు. అలాంటి సీమలో మొన్నటి ఎన్నికల్లో 52 సీట్లకు గాను..కూటమి 45 సీట్లు గెలుచుకుంది. 41 సీట్లు టీడీపీ, 4 సీట్లు బీజేపీ, ఒకటి జనసేన గెలుచుకున్నాయి. కంచుకోటలో వైసీపీ బలం ఏడు సీట్లకు పరిమితమైంది. పైగా వైఎస్‌ జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేల మెజార్టీ భారీగా పడిపోయేలా చేసింది కూటమి.

ఇప్పుడు ఆ 45 సీట్లు తిరిగి గెల్చుకోవడమే కాకుండా..సీమ కోటలో వైసీపీని తిరిగి పుంజుకోనివ్వకుండా వరుస కార్యక్రమాలు తీసుకుంటూ పక్కా స్కెచ్ వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అక్కడ మహానాడు నిర్వహించి అటెన్షన్ గ్రాబ్ చేసింది. తర్వాత పట్టుబట్టి..జగన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలోని పులివెందుల, తర్వాత ఒంటిమిట్ట జడ్పీటీసీ సీట్లలో గెలిచి చూపించింది. ఇక పవన్ కల్యాణ్ అయితే వరుస టూర్లతో సీమలో పర్మినెంట్‌గా పాగా వేస్తామని చెబుతున్నారు. బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్ అయిన పీవీఎన్ మాధవ్‌ కూడా సీమ నుంచే కార్యక్రమాలు చేపడుతూ వైసీపీ ఓటు బ్యాంకు మీద ఫోకస్ పెట్టారు.

Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి బంపర్ బొనాంజా..

సీమపై సీఎం చంద్రబాబు వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే ప్రభుత్వ పరంగా సీమలో ప్రాజెక్టులు, డెవలప్‌మెంట్ అంతా పరుగులు పెట్టిచేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో సీమకు 30 శాతం కేటాయించారు. హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీళ్లు తెచ్చారు. కడపలో ఉక్కు ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించారు. సీమలో ఎక్స్‌ ప్రెస్ హైవేల పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఒకవైపు అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం పూర్తి అనే ప్రయారిటీస్‌కు తోడుగా రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టారు.

గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికన్నా ఎక్కువగా గత ఏడాది మధ్యకాలంలో 10 సార్లకు పైగా రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 3వేల కోట్లు కేటాయించారు. కాలువ లైనింగ్ పనులు చేయించి హంద్రీనీవా ప్రాజెక్టులో నీటిని విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పనులు స్పీడప్

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలు, కడప జిల్లాల్లోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ వార్డ్స్‌ను, రాయలసీమలో ఎక్స్ ప్రెస్ హైవేలను, ఇండస్ట్రియల్ కారిడార్ పనులను స్పీడప్ చేస్తున్నారు. అన్నింటికి మించి టీడీపీ చరిత్రలో తొలిసారిగా రాయలసీమ నడిబొడ్డులోని కడపలో మహానాడును గ్రాండ్ సక్సెస్ చేశారు. వైసీపీ హయాంలో కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చేసిన ప్రయత్నాలకు దీటుగా, గత ఎన్నికల్లో టీడీపీ నినాదం అయిన వైనాట్ పులివెందులను 2029 ఎన్నికల్లో సాధించే దిశగా అడుగలు వేస్తున్నామని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఎన్నికల మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చిన సందర్భంగా విజయోత్సవ సభకు ప్లాన్ చేసింది కూటమి. అందుకు సీమనే వేదికగా చేసుకుంటోంది. ఈ నెల 10న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో అనంతపురంలోని శ్రీనగర్ కాలనీ జిఎంఆర్ గ్రౌండ్స్‌లో సభను నిర్వహించబోతోంది. దాదాపు 3 లక్షల మందితో నిర్వహించిన కడప మహానాడు బహిరంగ సభను మించి..3.50 లక్షల మందితో సూపర్ సిక్స్ సూపర్ హిట్‌ సభకు ప్లాన్ చేస్తున్నారు.

సభలో లక్ష మంది మహిళలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో రాయలసీమపై స్పెషల్ కాన్సంట్రేషన్‌ చేసి..స్థానిక హామీలను నెరవేర్చి, పెండింగ్ ప్రాజెక్టులకు ముందుకు సాగేలా చేస్తోంది. మొత్తం మీద సీమ మీద గట్టిగానే ఫోకస్ పెట్టింది కూటమి. త్రిముఖ వ్యూహం..ట్రయాంగిల్ ప్రోగ్రామ్స్‌తో వైసీపీని అక్కడ కోలుకోకుండా చేసే వ్యూహంలో బిజీగా ఉన్నాయి కూటమి పార్టీలు.