కలెక్టరేట్‌లో జనసేనానీ : వైసీపీకి వకీల్ సాబ్ వార్నింగ్

Janasenani in Collectorate : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఇంతియాజ్ లేకపోవడంతో పవన్.. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నివార్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ౩5వేల చొప్పున పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం పెంచాలని కోరారు. లేకపోతే వచ్చే శాసన సభ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

అంతకుముందు…కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పవన్‌ కల్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. అందుకే తాము రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీ నేతలు నిర్వహిస్తున్న పేపర్లు, ఇసుక మాఫియా, వైన్ షాపులు, సిమెంట్, మైనింగ్ బిజినెస్‌లు మూసివేసి రాజకీయాల్లోకి వస్తే.. తాను కూడా సినిమాలు మానేసి పూర్తిస్థాయి రాజకీయాల్లో వస్తానని సవాల్ విసిరారు.

వెంటనే ప్రభుత్వం దిగివచ్చి.. రైతులకు 10వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రైతులకు ఇవ్వాల్సిన 35వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం ఇవ్వకపోతే స్వయంగా తానే అసెంబ్లీని రైతులతో కలిసి ముట్టడిస్తామని పవన్ హెచ్చరించారు. తాను ఎవరికి భయపడనని పవన్ కళ్యాణ్ అన్నారు. భయపడితే ఏ పని జరగదన్నారు. నోరేసుకుని తమను తిడితే ఇంట్లో కూర్చోమని.. రోడ్లపైకి వచ్చి ఇళ్ల ముందు నిరసన చేస్తామన్నారు. పద్ధతిగా ఉండాలని హెచ్చరించారు. సీఎం జగన్‌కు భజన చేసింది చాలని.. రైతులకు ఉపయోగపడే పని చేయాలని మంత్రి నానికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం తనను తిట్టినా పర్వాలేదని.. రైతులకు మాత్రం మేలు చేయాలని సెటైర్లు వేశారు.