Suvarnagiri : జొన్నగిరితో సీమకు బంగారు భవిష్యత్‌.. సువర్ణగిరి వైభవాన్ని తిరిగి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

Suvarnagiri : ఒకప్పుడు కేజీఎఫ్‌ గురించి చర్చ జరిగేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జొన్నగిరి గురించి చర్చ నడుస్తోంది.. జొన్నగిరితో సీమకు సువర్ణగిరి వైభవాన్ని తిరిగి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Suvarnagiri

Suvarnagiri : రాయలసీమ అభివృద్ధికి జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు కొత్త దిశానిర్దేశం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత రెండో యూనిట్‌ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు సువర్ణగిరిగా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న ఈ ప్రాంతం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితమే బంగారం, రత్నాల సంపదతో ఈ నేల ప్రసిద్ధి చెందగా, ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే కేంద్రంగా మారబోతుందని చెప్పారు.

జొన్నగిరి సువర్ణగిరిగా :
జొన్నగిరి ప్రాజెక్టు అనేది కేవలం ఒక గని మాత్రమే కాదన్నారు. రాయలసీమ ఆర్థిక పురోగతికి బలమైన పునాదిగా అభిప్రాయపడ్డారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సువర్ణగిరిగా పిలిచేవారని, అశోకుడి 4 రాజధాని కూడా ఇదేనని చంద్రబాబు గుర్తుచేశారు.

అయితే, జొన్నగిరిని సువర్ణగిరిగా మార్చుకుందామా? అని పిలుపునిచ్చారు. వందల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండి ఉందని, అశోకుడి శాసనాలు చూస్తుంటే తెలుస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో రాయలసీమ ప్రాంతానికి ప్రాణం పోశామని చెప్పారు. ఒకప్పుడు కేజీఎఫ్‌ గురించే ఎక్కువగా వినిపించేది. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా జొన్నగిరి గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందన్నారు.

Read Also : Telangana Rains : తెలంగాణకు వర్షాల అలర్ట్.. ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక!

దేశంలో గోల్డ్‌కు ఫుల్ డిమాండ్‌ ఉంది. అందుకే స్వదేశీ ఉత్పత్తి పెరగడం చాలా అవసరమన్నారు. ఈ ప్రాజెక్టు కూడా ఆ దిశగా కీలక పాత్ర షోషిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. తద్వారా రాష్ట్ర ఆదాయానికి కూడా భారీగా దోహదపడుతుందని చెప్పారు.

యువతకు భారీగా ఉద్యోవకాశాలు :
అంతేకాదు.. ఈ బంగారు గని ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు కూడా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గని ప్రాజెక్టుతో అనుబంధ పరిశ్రమలు, సేవారంగం కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు.

బంగారం ఆధారిత నగల తయారీ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. అదే జరిగితే జొన్నగిరి ఖనిజ సంపదకే పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల కేంద్రంగా కూడా ఎదుగుతుందన్నారు.

రాయలసీమలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు వేగంగా వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంపై దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల దృష్టిపడుతుందని, రాబోయే రోజుల్లో రాయలసీమను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా సీఎం స్పష్టం చేశారు. తద్వారా జొన్నగిరి పేరు దేశవ్యాప్తంగా మార్మోగే రోజు ఎంతో దూరంలో లేదని ఆశాభావం వ్యక్తం చేశారు.