ఎన్నికల గుర్తును స్వయంగా తయారు చేసుకున్న కేఏ పాల్!

మాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరని రాష్ట్రంలో ఎంతో మంది బాధపడ్డారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకులు మాకు సింబల్ రాకుండా చేయాలని ప్రయత్నించారు.

KA Paul Pot Symbol: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుమ్మరి(potter) అవతారం ఎత్తారు. తమ పార్టీ ఎన్నికల గుర్తును స్వయంగా తయారు చేశారు. ఎన్నికల సంఘం ఆయన పార్టీకి మట్టికుండ గుర్తు కేటాయించింది. దీంతో ఆయన మట్టితో స్వయంగా కుండ తయారు చేసి చూపించారు. కాగా, విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి తరపున పోటీ చేస్తున్న ఆయన తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. కుండ ప్రాధాన్యత గురించి ఆయన వివరించారు.

”ఏప్రిల్ 10 తారీఖున ఉగాది రోజు ప్రజాశాంతి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కుండ గర్తు కేటాయించింది. మాకు ఎన్నికల గుర్తు ఇచ్చిన ఈసీకి, ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తులకు ధన్యవాదాలు. కుండ.. ప్రతి ఒక్కరికీ ఒక మంచి గుర్తు. ఈ కుండను నింపుకోండి, జీవితాలను మార్చుకోండి. ఎవరికీ, ఎప్పుడు కూడా కుండ అన్యాయం చేయలేదు. ఫ్యాన్ కు ఉరేసుకుని చాలా మంది చనిపోయారు. గ్లాసులు పగిలిపోయి చాలా మందికి హాని జరిగింది. సైకిళ్లు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు. కుండ తన మంచినీటితో కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది. కుండ గుర్తే మన విజయానికి నిదర్శనం. ఇంకా మీకేమైనా అనుమానం ఉందా?

మాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరని రాష్ట్రంలో ఎంతో మంది బాధపడ్డారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకులు మాకు సింబల్ రాకుండా చేయాలని ప్రయత్నించారు. నేనే స్వయంగా హైకోర్టులో వాదించి ఈ కుండ గుర్తు సంపాదించాను. ఏపీలో ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, మీ జీవితాలను మార్చుకోండి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పిస్తామ”ని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

Also Read: పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం లభ్యం.. దాని విలువ రూ.5.6 కోట్లు

ట్రెండింగ్ వార్తలు