మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని గట్టిగా తన వాణి వినిపించారు కన్నా. మూడు రాజధానులు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదని అన్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని, పాలనా వికేంద్రీకరణకు మాత్రం వ్యతిరేకమని అన్నారు. ఇంతలో ఏమైందో ఏమో గానీ.. మళ్లీ యూ టర్న్ తీసుకున్నారు కన్నా..
మొన్నటి వరకూ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా వ్యతిరేకించారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయొచ్చన్న జగన్ ప్రతిపాదనను కన్నా ప్రతి రోజు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. జగన్ ప్రకటన రాగానే స్వాగతించిన కన్నా మరుసటి రోజు నుంచి వ్యతిరేకించటం మొదలుపెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను గమనిస్తే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి మద్దతుగానే కన్నా కూడా జగన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారని అంటున్నారు. ఒకవైపు మరో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావేమో రాజధానుల విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా సుజనా, కన్నా పట్టించుకోవటం లేదు.
కేంద్రం జోక్యం ఎందుకు? :
ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాజధానుల విషయంలో కేంద్రానికి సంబంధం లేదన్నారు. పనిలో పనిగా రాజధానుల విషయంలో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కారణాలేవైనా కిషన్‌రెడ్డి హెచ్చరికలు కన్నా లక్ష్మీనారాయణపై బాగానే పని చేశాయని అంటున్నారు జనాలు. అందుకనే తాజాగా కన్నా యూ-టర్న్ తీసుకున్నారు. రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమేనని, ఇందులో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుదని ఎదురు ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న విన్న జనాలు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలోనే కన్నాలో ఈ మార్పేంటి అంటూ ఆలోచనలో పడ్డారు.
గతంలో కూడా తానెప్పుడూ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని చెప్పలేదని కన్నా చెప్పడం విడ్డూరంగా ఉందని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే కేంద్రప్రభుత్వం చూస్తు ఊరుకోదని పదే పదే హెచ్చరించిన విషయాన్ని కన్నా మరచిపోయినట్లున్నారని బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది.
రాష్ట్రాలకు అనుగుణంగా వాటిలో కొంతమేరకు వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ, ఏపీ రాజధాని విషయంలో కేంద్ర పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు. రాష్ట్రానికి చెందిన నాయకులే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రకటన వచ్చే వరకూ మరి కన్నా ఇంకెన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో చూడాలని జనాలు అనుకుంటున్నారు.