మరోసారి కేసీఆర్, జగన్ భేటీ : 3 రాజధానులపై చర్చ..?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్‌, కేసీఆర్‌ చర్చించే

  • Publish Date - January 8, 2020 / 02:28 AM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్‌, కేసీఆర్‌ చర్చించే

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్‌, కేసీఆర్‌ చర్చించే అవకాశముంది. ఏపీలో మూడు రాజధానులపై చర్చ జరుగుతుండటంతో ఇద్దరు సీఎంల భేటీకి ప్రాధాన్యమేర్పడింది. నదుల అనుసంధానం సహా రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశముంది. 

సుదీర్ఘ విరామం తరువాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఇందు కోసం జవనరి 13వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత.. తొలిసారి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అదే విధంగా కేసీఆర్ కూడా పలుమార్లు అమరావతి వెళ్లొచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన సమస్యలు సహా అనేక అంశాలపై చర్చించారు. కొన్ని పరిష్కారం కాగా.. మరికొన్ని క్లియర్ అవ్వాల్సిన అంశాలు ఉన్నాయి. 

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇప్పటికే ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాలు వేర్వేరుగా, ఉమ్మడి ప్రతిపాదనలు చేశాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 13న జరగనున్న సమావేశంలో..దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. అలాగే కేంద్ర సంబంధాలతో పాటు ఏపీలో కీలక అంశంగా మారిన మూడు రాజధానుల అంశంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఈ సారి ఈ ఇద్దరి సమావేశం కీలకంగా మారనుంది.

జాతీయ స్థాయిలో పౌరసత్వ బిల్లుకు వైసీపీ అనుకూలంగా ఓటు వేసింది. కానీ ఎన్ఆర్సీ విషయంలో మాత్రం ఏపీలో అమలు చేయమని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ మాత్రం ఈ బిల్లును మొదట్నుంచి వ్యతిరేకించింది. ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్, సీఏఏ అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ అంశాలపై కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 

రాష్ట్ర విభజన తరువాత పరిష్కారం కాని 9, 10 షెడ్యూళ్లలోని అంశాలపై ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలుపుకుంటే పలు సమస్యలకు పరిష్కారం దక్కనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ విభజనపైనా చర్చలు జరిగే అవకాశముంది. అలాగే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు.. ఆర్టీసీ తుది విభజన…వంటి అంశాల పై చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.