Kesineni Nani: చంద్రబాబు అరెస్ట్.. కేంద్రానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని లేఖ

Kesineni Nani letter to union government on Chandrababu Naidu arrest

Kesineni Nani Letter: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest) విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని నాని లేఖలు రాశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విడివిడిగా కేశినేని నాని లేఖలు పంపించారు. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించి ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని రక్షించాలని లేఖలో కోరారు. చంద్రబాబుపై రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని.. ఆధారాల్లేకుండా ఆయనను అరెస్ట్ చేశారని తెలిపారు. రాజకీయ కక్షతో ఈ కేసులు పెట్టారని, ఏపీ పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అక్రమంగా జరిగిన చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ట్విటర్ లో అభ్యర్థించారు.

న్యాయం తప్పక గెలుస్తుంది
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అక్రమాల కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. చంద్రబాబు నాయుడు నిస్వార్థ ప్రజా సేవకుడని, న్యాయం ధర్మం తప్పక గెలుస్తుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. “నీతి నిజాయితీలకు మారుపేరు చంద్రబాబు నాయుడు. 45 సంవత్సరాలు తన జీవితాన్ని ప్రజల కోసం సమాజం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం అంకితం చేసిన గొప్ప ప్రజా సేవకుడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. న్యాయం ధర్మం తప్పకుండా విజయం సాధిస్తుంద”ని తన ప్రకటనలో పేర్కొన్నారు.

నల్ల జెండా ఎగురువేసిన టీడీపీ నేతలు
తమ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట పార్టీ నేతలు నల్ల జెండా ఎగురవేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ.. సీఎం జగన్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు.

టీడీపీ శ్రేణుల ఆందోళనలు
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కృష్ణాజిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. చప్పట్లు కొడుతూ.. జై బోడే, చంద్రబాబు నాయుడి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు
చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో తెలుగు తమ్ముళ్లు స్కూటర్ కు నిప్పుపెట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.