×
Ad

Tsunami Bees: బాబోయ్.. మళ్లీ దూసుకొస్తున్న సునామీ ఈగలు.. కుడితే చావే..! ఏపీ తీరప్రాంత ప్రజల్లో భయం భయం..

ONGC అధికారులు, ఫైర్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం అంతా కలిసి అప్పట్లో వాటిని చెట్టు తొర్రలోనే కాల్చి బూడిద చేశాయి.

Tsunami Bees: ఏపీలో తీర ప్రాంత ప్రజలకు సునామీ ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ విషపుటీగలు కుడితే వారు ఆసుపత్రి పాలు కావాల్సిందే. ఇంకా ఆశ్రద్ధ చేస్తే ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో సునామీ సందర్భంలో వచ్చిన ఈ విషపుటీగలను ONGC సహకారంతో ఫైర్ సిబ్బంది మట్టుబెట్టారు. ఇప్పుడు మరోమారు ఈ విషపుటీగలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే గజగజ వణుకుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీర ప్రాంతం 19 కిలోమీటర్లు ఉంది. గతంలో సునామీ వచ్చిన సందర్భంలో భయంకరమైన విషపుటీగలు ఇక్కడకు వలస వచ్చాయి. సునామీ ఈగలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఈ విషపుటీగలు కుట్టి అప్పట్లో నలుగురు చనిపోయారు. ONGC అధికారులు, ఫైర్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం అంతా కలిసి అప్పట్లో వాటిని చెట్టు తొర్రలోనే కాల్చి బూడిద చేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఎలా వచ్చాయో తెలియదు. కానీ, మళ్లీ గ్రామగ్రామాన విషపుటీగలు విస్తరించాయి.

చూసేందుకు చిన్నపాటి కందిరీగల్లా ఉండే విషపుటీగలు ఇప్పుడు పరిమాణం పెరిగి పెద్ద పెద్ద ఈగలుగా మారిపోయాయి. చెట్లపై మట్టితో గుండ్రటి ఆకృతిలో గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో సంచరించే వారిపై దాడి చేస్తున్నాయి. మేకలు, గేదెలు వంటి మూగజీవాలపైనా దాడి చేసి వాటిని హతమారుస్తున్నాయి.

పేరుపాలెం సౌత్ పరిధిలోని ఉంగరాల వారి మెరకలో ఓ కొబ్బరి చెట్టుకు వీటి గూడు కనిపిస్తోంది. వేముల దీవి పడమర పరిధి కాపుల కొడపలో మూడు ఇళ్ల మధ్య ఉన్న చెట్లపై ఈ విషపుటీగలు దర్శనం ఇస్తున్నాయి. ఈ సునామీ ఈగలు దాడి చేస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరోవైపు ఈ విషపుటీగల విషంలో హీమోలైసిన్లు, న్యూరోటాక్సిన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అవి కుట్టిన భాగంలో తీవ్రమైన నొప్పితో పాటు వాపు కనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఉబ్బసం, వాంతులు, కడుపునొప్పి వంటివి కనిపించవచ్చని.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

నరసాపురం పట్టణంలో నిత్యం వందలామంది సంచరించే నరసాపురం సబ్ కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ఆవరణలో కూడా ఇటీవల వీటి గూడు కనిపించింది. సునామీ ఈగలు దాడి చేయడంతో కొందరు ఉద్యోగులు ఆసుపత్రిలో చేరారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సునామీ ఈగల గూడును కాల్చి వేశారు. వీటి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

Also Read: నన్ను అంతమొందించాలన్న కుట్ర? సిరిమాను ఉత్సవంలో ఘటనపై బొత్స సంచలన వ్యాఖ్యలు..