Kalisetti AppalaNaidu-Kalavenkata Rao
టీడీపీలో ఆయన సీనియర్ నేత. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా సుదీర్ఘ అనుభవం. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… ఇటువంటి నేతకు ఈ ఎన్నికల సమయంలో కొత్త కష్టం వచ్చిపడింది. ఓ జూనియర్ నేత నుంచి సవాల్ ఎదురవుతోంది. ఒక్క చాన్స్, ఒకే ఒక్క చాన్స్ అంటూ ఆ జూనియర్ నేత నియోజకవర్గాన్ని చుట్టేస్తూ… అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండటం రాజకీయంగా ఆసక్తి పుట్టిస్తోంది.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేత, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు. తెలుగుదేశం పార్టీలోని ప్రముఖ నేతల్లో కళా ఒకరు. ఆవిర్భావం నుంచి టీడీపీతో కళాకు ఎంతో అనుబంధం ఉంది. మధ్యలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీకి వెళ్లినా, ఓటమితో మళ్లీ సొంతగూటికే వచ్చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో కళా ప్రభావం స్పష్టంగా ఉంటుంది.
ఐతే ఇదంతా గతం… వర్తమానం మారింది బాస్ అంటున్నారు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ లీడర్లు. కళా సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీ రిజర్వుడు కావడంతో 2009 నుంచి ఎచ్చెర్లనే తన అడ్డాగా చేసుకుని పోటీ చేస్తున్నారు.
కళా.. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన కళా, 2014 ఎన్నికల సరికి తిరిగి సొంతగూటికి వచ్చేశారు. టీడీపీ తరఫున ఆ ఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించారు. ఐతే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ హవాతో పరాజయం పాలయ్యారు కళా.. ఇక అప్పటి నుంచి ఆయనపై సొంతపార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న కళాను తప్పించి, తనకు చాన్స్ ఇవ్వాలని ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు కోరుతున్నారు. ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణ శిబిరానికి ఇన్‌చార్జిగా పనిచేసిన కలిశెట్టికి పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేశ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి.
2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పాదయాత్రలు, సైకిల్‌యాత్రలు అంటూ కాకరేపుతున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్ నేత కళాకు కంట్లో నలుసులా తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే ముద్రవేసి కలిశెట్టిని సస్పెండ్ చేయించారు కళా… పార్టీ సస్పెన్షన్ విధించినా లైట్‌గా తీసుకున్న కలిశెట్టి… నిను వదల బొమ్మాళి అన్నట్లు టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జిల్లా నేతలు ఆదేశించినా, కలిశెట్టి అస్సలు పట్టించుకోవడం లేదు. కార్యకర్తలు కూడా ఆయన వెన్నంటే నడుస్తుండటంతో ఎచ్చెర్ల టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది.
జోరుచూపిస్తున్న కలిశెట్టి
ఇక పార్టీ కార్యక్రమాల్లో జోరుచూపిస్తున్న కలిశెట్టి… తగ్గేదేలే అన్నట్లు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తుండటంతో కళా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పక్కాగా గెలిచే స్థానంగా లెక్కలేసుకుంటున్న ఎచ్చెర్లలో గ్రూప్‌వార్ కార్యకర్తలను కలవరానికి గురిచేస్తోంది. విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో వైసీపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
స్థానిక ఎమ్మెల్యేపై గ్రామస్థాయి నుంచి వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా సర్వేలు రిపోర్ట్‌లు వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేకూ ఇంతవరకు టికెట్ కన్ఫార్మ్ చేయలేదు వైసీపీ… ఇటు వైసీపీ, అటు టీడీపీలోనూ ఒకేరకమైన పరిస్థితులు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులు అవుతారనేది ఉత్కంఠ రేపుతోంది.