KODALI NANI
YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశం కావడంపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ప్రశాంత్ కిశోర్‌ను తాము పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని చురకలంటించారు.
చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్‌ను చేసేదేమీ ఉండదని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయనాయకుడని అన్నారు. వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఉన్నప్పుడు చంద్రబాబు విమర్శలు గుప్పించారని ఇప్పుడేమో ఆయనతో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. అసలు ప్రశాంత్ కిశోర్‌కు, ఐ ప్యాక్‌కు సంబంధం లేదని చెప్పారు.
ఇండియా కూటమిలో చేరాలని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిశోర్ వచ్చారని ఆరోపించారు. ఇక్కడి పాట్నర్ పీకే బీజేపీతో చర్చలు జరుపుతున్నారని, బిహార్ నుంచి వచ్చిన మరో పీకే ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.