Kondapi Constituency: కొండపిలో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థి ఎవరు.. ఈసారి టీడీపీకి గెలుపు అంత ఈజీ కాదా?

కొండపిలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం.. ఇరువర్గాల నేతలను తాడేపల్లి పిలిపించి మాట్లాడినా దారికి రాకపోవడంతో సీఎం జగన్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారని టాక్ నడుస్తోంది.

Kondapi Assembly Constituency Ground Report

Kondapi Assembly Constituency: కొండపి రాజకీయం కాకమీద కనిపిస్తోంది. టీడీపీ కంచుకోటైన ఈ నియోజకవర్గంలో అధికార వైసీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఓ ఇన్‌చార్జిని మార్చగా.. ఇప్పుడున్న ఇన్‌చార్జిని మార్చమంటూ డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. అంతేకాదు పరస్పర భౌతిక దాడులు జరుగుతుండటం రాజకీయంగా హీట్‌పుట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామి మరోసారి టీడీపీ నుంచి బరిలో దిగడం ఖాయమే అంటున్నారు.. మరి వైసీపీ అభ్యర్థి (YCP Candidate) ఎవరు? కొండపిలో ఈ సారి కనిపించబోయే సీనేంటి?

ప్రకాశం జిల్లా (Prakasam district) లో కొండపి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం.. 1955లో ఏర్పడిన కొండపీ నియోజకవర్గం మొదట కాంగ్రెస్‌కు కంచుకోట. 1982 నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా మారింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో 28 చోట్ల వైసీపీ గెలిచినా.. కొండపిలో మాత్రం టీడీపీ హవాకు అడ్డకట్ట వేయలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా కొండపిలో గెలుపు అంత ఈజీగా కనిపించడం లేదని చెబుతున్నారు పరిశీలకులు.. ఈ నియోజకవర్గంలో వైసీపీలో రెండు మూడు వర్గాలు నిత్యం కుమ్ములాటలతో రోడ్డెక్కుతున్నాయి. భౌతిక దాడులకు దిగుతూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Dola Sree Bala Veeranjaneya Swamy

ఈ నియోజకవర్గంలో సింగరాయకొండ, కొండపి, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు ఉన్నాయి. వీటిల్లో కొండపీ, జరుమల్లి, టంగుటూరు మండలాలు టీడీపీకి కొమ్ముకాస్తున్నాయి. పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లో వైసీపీకి పట్టు ఉన్నా.. గెలుపు వరకు తీసుకువెళ్లలేకపోతున్నాయి. సింగరాయకొండ మండలం మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ, టీడీపీ వైపు నిలుస్తూ విజేతలను నిర్ణయిస్తోంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సామాజిక వర్గం నేతల ఆశీస్సులు ఉన్నవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి (Dola Sree Bala Veeranjaneya Swamy)కి కూడా చరిష్మా ఉండటం టీడీపీకి కలిసివస్తోంది.

Also Read: యర్రగొండపాలెంలో గెలుపు నీదా, నాదా.. సై అంటున్న వైసీపీ, టీడీపీ

2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి.. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో ఎలాంటి గ్రూపులు లేకపోవడం.. నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గం ఆశీస్సులు పుష్కలంగా ఉండటం ఎమ్మెల్యేకు ప్లస్ పాయింట్స్‌గా చెబుతున్నారు. దివంగత నేత దామచర్ల ఆంజనేయులు మనవడైన సత్యా అండదండలు ఉండటంతో ఎమ్మెల్యేకు కలిసివస్తోంది. 2019లో హోరాహోరీ పోరులో జరిగిన వైసీపీ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మాదాసి వెంకయ్యస్వామిపై వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిచారు ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి. ఈ సారి కూడా వైసీపీలోని వర్గ విభేదాలు తనకు కలిసివస్తాయంటున్నారు ఎమ్మెల్యే.

Madasi Venkaiah

కొండపి వైసీపీలో ఆధిపత్యపోరు ప్రధాన సమస్యగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాదాసి వెంకయ్యస్వామి (Madasi Venkaiah) వర్గానికి.. ప్రస్తుత ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు (Varikuti Ashok Babu) వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు కూడా దిగుతుండటంతో క్యాడర్ చల్లాచదురైపోతున్నారు. అధిష్టానం కూడా ముఠా కుమ్ములాటలపై సీరియస్‌గా దృష్టి పెట్టకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్‌ను సమన్వయం చేయలేకపోతున్నారని డీసీసీబీ చైర్మన్ మాదాసి వెంకయ్యను తప్పించి వరికూటి అశోక్ బాబును ఇన్‌చార్జిగా నియమించింది అధిష్టానం. అయితే మాదాసి.. వరికూటి వర్గాల మధ్య తొలినుంచి విభేదాలు ఉన్నాయి. గతంలో వరికూటి సహకరించలేదని.. ఇప్పుడు అదే పనిని మాదాసి వర్గం చేస్తుండటంతో వైసీపీలో గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో వరికూటి అశోక్ బాబుకు సీటు ఇస్తే తాము సహకరించమని ఆయన ప్రత్యర్థులు తేల్చిచెబుతున్నారు. ఈ సారి కూడా మళ్లీ తనకే చాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు మాజీ ఇన్‌చార్జి మాదాసి వెంకయ్య.

Varikuti Ashok Babu

కొండపిలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం.. ఇరువర్గాల నేతలను తాడేపల్లి పిలిపించి మాట్లాడినా దారికి రాకపోవడంతో సీఎం జగన్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారని టాక్ నడుస్తోంది. వరికూటి సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చి.. ఆయన స్థానంలో మాదాసి వెంకయ్య, తాడిపర్తి చంద్రశేఖర్ (Tatiparthi Chandra Sekhar), ఒంగోలు మేయర్ గంగాడ సుజాత (Gangada Sujatha), మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కూతురు పద్మావతి పేర్లు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో చంద్రశేఖర్ స్థానికుడు కావడం.. ఆర్థికంగా కూడా స్థితిమంతుడు కావడంతో ఆయనను కొత్త ఇన్‌చార్జిగా నియమించే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఆయన మాదిగ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం ఒక్కటే మైనస్‌గా చెబుతున్నారు. అయితే చంద్రశేఖర్‌కు స్థానిక నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో.. ఆయనైతేనే కొండపిలో గ్రూపు రాజకీయాలను చక్కదిద్దగలరని భావిస్తోంది వైసీపీ హైకమాండ్.

Also Read: బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారా.. ఒంగోలు సెగ్మెంట్‌లో ఈసారి టఫ్ ఫైట్ తప్పదా!

Gangada Sujatha

ఇలా అధికార పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతుండగా.. టీడీపీ మాత్రం వరుస కార్యక్రమాలతో జోష్ మీద కనిపిస్తోంది. ఇక మిగిలిన పార్టీలు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపే పరిస్థితుల్లో లేవు. వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండటం.. గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే అధికార పార్టీ మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు.