Yerragondapalem Constituency: యర్రగొండపాలెంలో గెలుపు నీదా, నాదా.. సై అంటున్న వైసీపీ, టీడీపీ

యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు.

Yerragondapalem Constituency: యర్రగొండపాలెంలో గెలుపు నీదా, నాదా.. సై అంటున్న వైసీపీ, టీడీపీ

Yerragondapalem Assembly constituency : యర్రగొండపాలెం.. అధికార వైసీపీ (YCP) కి కంచుకోట. అలాంటి కోటపై.. ఎలాగైనా సరే పసుపు జెండాను ఎగరేయాలనే కసితో ఉంది టీడీపీ. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి.. ఇక్కడ గెలవాలని చూస్తోంది తెలుగుదేశం (Telugu Desam). ఈసారి లోకల్ పొలిటికల్ వెదర్‌ని తమకు అనుకూలంగా మార్చుకునేలా.. వ్యూహాలు రచిస్తోంది. ఇక.. పసుపు పార్టీ ఎత్తులను పసిగట్టిన వైసీపీ.. పట్టు నిలుపుకోవడం మీదే దృష్టిసారించింది. గెలుపు నీదా.. నాదా.. సై అంటూ రెండు పార్టీలు కుస్తీ పడుతున్నాయ్. దాంతో.. యర్రగొండపాలెంలో రసవత్తర పోటీ ఖాయమని తెలుస్తోంది. మరి.. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

వైసీపీ ఆవిర్భావం తర్వాత.. యర్రగొండపాలెంలో ఆ పార్టీ తరఫున ఎవరు నిల్చున్నా.. జనం వాళ్లకే జై కొడుతున్నారు. కొన్నేళ్లుగా.. ఈ సీటులో గెలిచేందుకు తెలుగుదేశం ఎంతగానో ప్రయత్నిస్తున్నా.. ఆ పార్టీ కల నెరవేరడం లేదు. దాంతో.. ఈసారి ఎలాగైనా యర్రగొండపాలెంలో ఖాతా తెరవాలని చూస్తోంది టీడీపీ. లోకల్‌లో ఈ విధమైన రాజకీయ పరిస్థితులు ఎందుకున్నాయో అర్థమవ్వాలంటే.. ముందుగా ఇక్కడి పొలిటికల్ హిస్టరీని తెలుసుకోవాలి. 1955లో యర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడింది. 1972 దాకా.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యే పోరు నడిచింది. తర్వాత.. 2008 దాకా యర్రగొండపాలెం నియోజకవర్గం రద్దయిపోయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌గా ఏర్పడింది. అప్పుడు.. వైఎస్ఆర్ యువతకు సీట్ల ప్రాధాన్యత పిలుపుతో.. ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేశ్.

Audimulapu Suresh

ఆదిమూలపు సురేశ్ (photo: twitter)

2009లో యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలపు సురేశ్ (Audimulapu Suresh).. 2014లో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన సంతనూతలపాడు (Santhanuthalapadu) నుంచి పోటీ చేసి గెలిచారు. అదే ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన డేవిడ్ రాజు (David Raju) తర్వాత టీడీపీలో చేరారు. దాంతో.. ఆయన స్థానంలో నియోజవర్గ ఇంచార్జ్‌గా మళ్లీ ఆదిమూలపు సురేశ్‌ని నియమించింది వైసీపీ. 2019లో.. మరోసారి యర్రగొండపాలెం నుంచి బరిలో నిలిచి.. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం.. మంత్రిగా కొనసాగుతున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. యర్రగొండపాలెంలో ఫ్యాన్ పార్టీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ.. తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. టీడీపీ గట్టి పోటీ ఇస్తున్నా.. అభ్యర్థులు మాత్రం గెలవడం లేదు.

యర్రగొండపాలెం నియోజకవర్గంలో.. మొత్తం ఐదు మండలాలున్నాయి. అవి.. పుల్లల చెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, దోర్నాల (Dornala). వీటిలో.. రెండు మండలాల్లో అధికార పార్టీ వైసీపీ, మరో రెండు మండలాల్లో టీడీపీకి బలముంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 2 లక్షల 2 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. దళితుల ఓట్ బ్యాంక్ 57 వేలు, బీసీల ఓట్ బ్యాంక్ 52 వేలకు పైనే ఉంటుంది. ఇక్కడి.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో వీళ్లదే కీలకపాత్ర. గత రెండు ఎన్నికల్లో.. వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడంతో.. ఈ నియోజకవర్గం అధికార పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అయితే.. ఇప్పుడు ఆ కంచుకోటకు బీటలు వారుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయ్. నియోకవర్గంలో వైసీపీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తోందనే టాక్ వినిపిస్తోంది. మంత్రి ఆదిమూలపు సురేశ్, అతని అనుచరగణంపై.. అసంతృప్తి పెరిగిపోయిందంటున్నారు. మంత్రివర్గ మార్పుతో జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే.. తాజా పరిస్థితులకు కారణమంటున్నారు. మాజీ మంత్రి బాలినేని (Balineni) అనుచరగణమంతా.. ఆదిమూలపు సురేశ్‌పై గుర్రుగా ఉంది.

Budhala Ajitha Rao

అజితారావు (photo: facebook)

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చోటు చేసుకున్న ఘటనలు.. మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై వ్యతిరేకతను పెంచాయనే ప్రచారం జరుగుతోంది. ఆ ఘటన తర్వాత.. అప్పటికే ఉన్న కొంత వ్యతిరేకత ఇప్పుడు మరింత పెరిగిపోయిందంటున్నారు. దీనికితోడు.. నియోజకవర్గ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదనే టాక్ కూడా ఉంది. పైగా.. సొంత పార్టీ క్యాడర్‌లోనూ సురేష్‌పై వ్యతిరేకత ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో.. ఈసారి ఆయనకు కొందరు వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధిష్టానం కూడా ఆదిమూలపు సురేశ్‌ని యర్రగొండపాలెం నుంచి కాకుండా సంతనూతలపాడు, కోడుమూరులో ఏదో ఒక చోటు నుంచి గానీ.. బాపట్ల ఎంపీ (Bapatla MP)గా గానీ పోటీ చేయించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న అజితారావు (Budhala Ajitha Rao).. వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సురేష్ మాత్రం.. యర్రగొండపాలెం నుంచి బరిలో నిలవాలనుందని చెబుతున్నారు. అందులో భాగంగానే.. స్థానిక పరిస్థితులను చక్కబెట్టుకుంటానని సీఎం జగన్ దగ్గర కూడా చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. నెల రోజులుగా.. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనని గెలిపిస్తాయని చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని.. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని అంటున్నారు.

Erixion Babu Guduri

ఎరిక్సన్ బాబు (photo: facebook)

ఇక.. తెలుగుదేశం విషయానికొస్తే.. గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అజితారావును కాదని.. ఎరిక్సన్ బాబు (Erixion Babu Guduri) ను చంద్రబాబు ఇంచార్జ్‌గా నియమించారు. తర్వాత.. లోకల్ టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయ్. అధిష్టానం కలగజేసుకొని.. నాయకులకు సర్దిచెప్పింది. ఇటీవలే.. చంద్రబాబు మార్కాపురం (Markapuram) పర్యటనలో.. రాబోయే ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి పోటీ చేసేది ఎరిక్సన్ బాబేనని.. మిగతా నేతలకు క్లారిటీ ఇచ్చేశారని.. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాంతో.. విభేదాలను పక్కనపెట్టి.. మన్నెం రవీంద్ర.. ఎరిక్సన్ బాబుతో కలిసి పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన చంద్రబాబు పర్యటన.. క్యాడర్‌లో మరింత జోష్ నింపింది. వైసీపీని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను.. టీడీపీ నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. యర్రగొండపాలెంకు ఎమ్మెల్యే సురేష్ చేసిందేమీ లేదని.. మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

Also Read: అధికార ప్రతిపక్షాల్లో గ్రూప్ వార్.. మైలవరంలో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి.. జనసేన కీలకం!

ప్రస్తుతానికి.. యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు. ఇక.. ఈ నియోజకవర్గంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. అందువల్ల.. రేసులో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మాత్రమే కనిపిస్తున్నాయి. వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో.. ఈసారి ఉత్కంఠ పోరు తప్పదనే అంచనాలున్నాయి. యర్రగొండపాలెం చరిత్రలో ఇప్పటిదాకా తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేకపోవడంతో.. ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలనే కసితో ఉన్నారు పసుపు పార్టీ నేతలు. చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనలతో.. లోకల్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం.. ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులతో.. ఆదిమూలపు సురేష్ గనక బరిలో నిలిస్తే.. తెలుగుదేశానికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాకాకుండా.. వైసీపీ అభ్యర్థిని మారిస్తే మాత్రం.. రసవత్తర పోరు ఖాయమంటున్నారు. మరి.. చరిత్రను తిరగరాసి.. టీడీపీ కొత్త చరిత్రను సృష్టిస్తుందా? వైసీపీనే సిట్టింగ్ సీటును నిలుపుకుంటుందా? అన్నది.. ఆసక్తిగా మారింది.