కోటంరెడ్డికి స్పీడ్‌బ్రేకర్లు ఏమైనా అడ్డొచ్చాయా? వైసీపీ కీలక నేతలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెట్టి కవ్వింపులు

కోటంరెడ్డిలో మార్పు చూసిన వారంతా.... తన సహజ శైలికి భిన్నంగా ఎన్నాళ్లు నడుచుకుంటారో చూద్దామని వ్యాఖ్యానిస్తున్నారు.

Kotamreddy Sridhar Reddy: ఆయన నెల్లూరు పెద్దారెడ్డి… ముక్కు సూటి మనిషి.. ముక్కు మీదే కోపం… అమ్మో ఆయనతో పెట్టుకోవడమా? అని భయపడేవారు అంతా.. నిజంగా గత పదేళ్లు ఆయనలో ఉగ్ర నరసింహుడినే చూపించారు. తేడా వస్తే ఖబడ్దార్‌ అన్నట్లే ఉండేది ఆయన స్పీడ్‌.. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు ఆయన ఓ శాంతి కాముకుడు. అనుచరులను సూక్తులు చెప్పే తత్వవేత్త..

తనవారైనా తప్పుచేస్తే వదలొద్దనే గాంధీగిరీ ప్రదర్శిస్తున్నారు… ఆయనలో ఈ మార్పు చూసిన వారంతా అసలేమైంది ఈయనకి… ఎందుకిలా మారిపోయారు? ఈయన ఆయనేనా? అని డౌట్‌ పడుతున్నారు? భారీ డైలాగ్స్‌ చెప్పే ఆ లీడర్‌ వాయిస్‌లో సౌండ్‌ తగ్గడానికి కారణమేంటి? ఇంతలా మారిపోయిన ఆ నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు?

నెల్లూరు రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన మాటలే తూటల్లా పేలుతుంటాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా తగ్గేదేలే అన్నట్లు దూకుడు చూపడమే కోటంరెడ్డి రాజకీయం. ఆయనతో పెట్టుకుంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారంటారు. నియోజకవర్గంలో తనమాటే చెల్లుబాటు కావాలనేలా పంతం పట్టేవారు.

ఈ పట్టింపులతోనే ఎన్నో చిక్కులు ఎదుర్కొన్నారు. అవమానాలు పడ్డారు. అయితే ఆయనలో ఇప్పుడు ఈ పంతం పట్టింపులు ఏవీ కనిపించడం లేదు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన కోటంరెడ్డి…. ఇంతకుముందులా దూకుడు చూపించకపోవడం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. కోటంరెడ్డికి స్పీడ్‌బ్రేకర్లు ఏమైనా అడ్డొచ్చాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

అవమానాలు
రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి… మూడోసారి టీడీపీ నుంచి పోటీచేసి రికార్డు మెజార్టీ సాధించారు. ఐతే రెండోసారి ఎమ్మెల్యేగా ఉండగా, వైసీపీ అగ్ర నాయకత్వంతో విభేదించి బటయకు వచ్చిన కోటంరెడ్డి… గత ఏడాదిన్నరగా తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేసిన కోటంరెడ్డి… మూడోసారి గెలిచిన తర్వాత గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన వారికి చుక్కులు చూపిస్తారని అంతా అనుకున్నారు.

ఆయన అనుచరులు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో ఈ తరహా హెచ్చరికలతో నెల్లూరు రాజకీయాల్లో దుమారం రేపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడైతే… వైసీపీ కీలక నేతలను రెచ్చగొట్టేలా వారి ఇళ్ల చుట్టూ ఫ్లెక్సీలు పెట్టి కవ్వింపులకు దిగారు. ఇలా చేయడం ద్వారా కోటంరెడ్డి అభినందనలు అందుకుంటామని అనుచరులు భావించారు. కానీ, వారు ఊహించినది ఒకటైతే.. కోటంరెడ్డి స్పందన అందుకు భిన్నంగా ఉండటంతో షాక్‌ తిన్నారు.

రాజకీయ ప్రత్యర్థులను రెచ్చగొట్టడం… వారిని అవమానించడం తప్పు అని చెబుతూ… ప్రత్యర్థుల ఇళ్ల వద్ద ప్లెక్సీలు వేసిన కార్యకర్తలకు క్లాస్‌ పీకిన కోటంరెడ్డి… అందరికీ షాక్‌ ఇచ్చారు. తాను మారానని.. మీరూ మారాలని చెబుతూ.. వెంటనే ప్లెక్సీలు తీసేయాలని లేదంటే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సొంత కార్యకర్తలకే బెదిరించి గాంధీగిరి ప్రదర్శించారు కోటంరెడ్డి. సహజంగా కోటంరెడ్డిలో ఈ యాంగిల్‌ను చూడని కార్యకర్తలకు మతిపోయిందని చెబుతున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఇలాంటి షాక్‌ ట్రీట్మెంట్లే ఎదురవుతుండటంతో కార్యకర్తలకు కోటంరెడ్డికి ఏమైంది? అని ప్రశ్నించుకుంటున్నారట…

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని చెబుతున్న కోటంరెడ్డి ఈ మధ్య తీసుకున్న మరో నిర్ణయం కూడా చర్చనీయాంశమవుతోంది. తన పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమంగా గ్రావెల్‌, ఇసుక తవ్వకాలు చేపడితే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారట కోటంరెడ్డి. నియోజకవర్గంలో అక్రమాలు చేసి దొరికిన వారు వైసీపీకి చెందిన వారైతే లక్ష రూపాయల ఫైన్‌ వేయాలని చెప్పిన కోటంరెడ్డి… అదే టీడీపీ కార్యకర్తలని చెబితే రెండు లక్షలు వసూలు చేయాలని చెప్పారట.

దూకుడు తగ్గించిన కోటంరెడ్డి
ఇక కోటంరెడ్డి తాలూకా అంటే ఏకంగా పది లక్షలు ఫైన్‌ వేయాలన్నారట… తప్పు చేసిన వారు తనమన అనే భేదం లేకుండా వ్యవహరించాలని ఆదేశించడం, తన వారైతే మరోసారి తప్పుచేయకుండా మరింత గట్టిగా చెప్పడమూ పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చకు తెరలేపింది. రాజకీయంగా దూకుడు తగ్గించిన కోటంరెడ్డి… అవినీతి వ్యవహారాల విషయంలోనూ కేడర్‌ను కంట్రోల్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.

కోటంరెడ్డిలో మార్పు చూసిన వారంతా…. తన సహజ శైలికి భిన్నంగా ఎన్నాళ్లు నడుచుకుంటారో చూద్దామని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి వైసీపీలో ఉన్నన్ని రోజులూ కోటంరెడ్డి హవా ఓ రేంజ్‌లో ఉండేది. ఆయనతో మాట్లాడాలంటేనే అధికారులు హడలిపోయేవారు. ఆయన ఫోన్‌ వచ్చిందంటే ఏం అంటారో అని టెన్షన్‌ పడేవారు. వైసీపీ నుంచి బహిష్కరణ వేటు పడినా…. అదే స్పీడ్‌ కనబరిచేవారు.

దమ్ముంటే రా.. చూసుకుందామని సవాళ్లు విసిరేవారు. కానీ, ఇప్పుడు సవాళ్ల స్థానంలో శాంతి వచనాలు వల్లే వేయడమే ఇంట్రెస్టింగ్‌గా మారిందంటున్నారు. నిజంగా కోటంరెడ్డి స్టైల్‌ మార్చారా? ఆయనలో ఈ గాంధీగిరికి కారణమేంటి అని అంతా ఆరా తీస్తున్నారు. ఏదిఏమైనా కోటంరెడ్డి సూక్తిముక్తావలి నెల్లూరు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: కాంగ్రెస్‌లో యూత్‌ లొల్లి? ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ వ‌ర్సెస్ యువ నేతలు

ట్రెండింగ్ వార్తలు