Balmuri Venkat: కాంగ్రెస్‌లో యూత్ లొల్లి? ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వర్సెస్ యువ నేతలు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అతిచిన్న వయసులో పెద్దల సభలో..
కాంగ్రెస్ అంటేనే మస్త్ పాలిటిక్స్. పొలిటికల్‌గా అదో డిఫరెంట్ యూనివర్సిటీ… ఎవరి లెక్కలు వారివి.. ఎత్తులు… పైఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలతో కాంగ్రెస్ అంతర్గత రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే.. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికల అంటే ఆ హడావుడి… కోలాహలమే సెపరేట్. ప్రస్తుతం జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎన్నో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి…. వన్ వర్సెస్ టెన్ అన్నట్లు పోటీ ఉండటంతో… యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది…
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ ఎన్నికలు హీట్‌ను పెంచుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా ఎన్నో విభాగాలున్నా.. యూత్ కాంగ్రెస్ అత్యంత ప్రత్యేకం. అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌లకు అధ్యక్షులను నామినేట్ చేసే కాంగ్రెస్.. యూవజన విభాగానికి మాత్రం ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ అమలు చేస్తోంది.
పార్టీ నిర్మాణంలో పీసీసీ చీఫ్ తర్వాత.. అతి కీలకమైన విభాగం యూత్ కాంగ్రెస్ అని చెబుతుంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేది యూత్ కాంగ్రెస్ విభాగం మీదనే. ఈ విభాగానికి ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చింది కూడా రాహుల్ గాంధీయే. అంతేకాదు ప్రతి కీలకమైన అంశంలో యూత్ కాంగ్రెస్‌ను భాగస్వామ్యం చేస్తుంటారు. అందుకే యూత్ కాంగ్రెస్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుంది.
ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు మస్త్ క్రేజ్ ఏర్పడింది. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తూ ఏకంగా 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐతే ఎన్నికల నిబంధనల ప్రకారం… దరఖాస్తు చేసుకున్న వారిలో 8 మందిని తిరస్కరించారు. దీంతో ఫైనల్‌గా 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
వీరిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబానికి చెందిన పొన్నం తరుణ్ గౌడ్, సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి కూతురు ఆంక్షా రెడ్డి, ఎల్బీనగర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తీవ్రంగా పోటీపడుతున్నారని చెబుతున్నారు.
పీసీసీ చీఫ్ విషయంలోనూ ఇలాగే
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మొత్తం పది మంది నేతలున్నా.. పోటీ మాత్రం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వర్సెస్ ఇతర నేతలు అన్న మాదిరిగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. గతంలో పీసీసీ చీఫ్ విషయంలో ఎలాంటి పోటీ ఏర్పడిందో అచ్చంగా ఇప్పుడు అదే సీన్ కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పోస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఇతర సీనియర్ నేతలు అన్నట్లు రాజకీయం నడిచేది.
రేవంత్ వద్దంటూ.. సీనియర్లు ఎవరికి వారు తమకే అవకాశం కావాలని పట్టుబట్టారు. అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. రేవంత్‌కు పీసీసీ దక్కకూడదనే ఉద్దేశంతో సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపింది.
ఇప్పుడు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచిన బల్మూరి వెంకట్ విషయంలో కూడా కొందరు నేతలు .. గతంలో రేవంత్ విషయంలో అనుసరించిన ధోరణినే అవలంబిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టి పోరాటాలు చేశారు. జైలుకు కూడా వెళ్లడానికి వెనుకాడలేదు.
బహిరంగంగానే వ్యతిరేకత
దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అతిచిన్న వయసులో పెద్దల సభలో అడుగుపెట్టిన వెంకట్….. ఇప్పుడు పార్టీ పరంగా ప్రమోషన్ కోరుతున్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీలో కీరోల్ ప్లే చేయాలని ఉబలాటపడుతున్నారట… ఐతే ఆయనకు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఉండటం వల్ల… కొందరు ఎమ్మెల్యేలు వెంకట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ వంటివారు బహిరంగంగానే తన వ్యతిరేకతను బయట పెడుతున్నారంటున్నారు.
విద్యార్థి నేతగా రాష్ట్రవ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్న వెంకట్.. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపుతున్నారంటున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్‌తో ఎన్నికల ప్రక్రియలో దూసుకుపోతుండంతో సీనియర్లు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. తమ మద్దతుతోనే ఎవరైనా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
సో.. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్‌లో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ట్రెండింగ్‌గా మారాయి. ఈ ఎన్నికలు పూర్తిగా ఎమ్మెల్సీ వెంకట్ వర్సెస్ ఇతర నేతలుగా మారింది. నెల రోజుల పాటు సాగే యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలి.
Alla Nani: ఆళ్ల.. ఎందుకలా? వైసీపీలో భవిష్యత్‌పై ఆయనలో ఆందోళన