Alla Nani: ఆళ్ల.. ఎందుకలా? వైసీపీలో భవిష్యత్‌పై ఆయనలో ఆందోళన
ఆళ్ల నాని రాజీనామాను ఈ దృష్టిలోనే చూడాలా? ఆళ్ల రాజీనామా ఏం సూచిస్తోంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే నేతలు కూడా పార్టీని వీడుతుండటం…. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఐదేళ్లు అధికారం చెలాయించిన నేతలు.. ఓటమి తర్వాత ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం దేనికి సంకేతం…. పాలిటిక్స్‌పై విరక్తి పెంచుకుంటున్నారా? డబ్బు ఖర్చైపోద్దని సైడైపోతున్నారా? ఏలూరు తాజా మాజీ ఎమ్మెల్యే…. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామాను ఈ దృష్టిలోనే చూడాలా? ఆళ్ల రాజీనామా ఏం సూచిస్తోంది.
అధికారం అందలం ఎక్కిస్తుందేమో గానీ… ప్రతిపక్షం తీవ్రమైన కష్టాలను తెస్తుందట… అందుకే ఐదేళ్ల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రాజీనామాలు చేసిన వారు ఏ పార్టీలోకి వెళతామని చెప్పకపోయినా, ఫలానా పార్టీతో టచ్‌లో ఉన్నారని ఏదో ఒక ప్రచారం జరిగేది.
కానీ, తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విషయంలో ఇలాంటి ప్రచారం జరగడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆళ్ల నాని… మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి…. జగన్ తొలి క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి… ఏలూరు వైసీపీ అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు. చివరికి ఎవరూ ఊహించని విధంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
పార్టీలో ప్రాధాన్యమిచ్చినా రాజీనామా
రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆళ్ల నాని…. రాజీనామా పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు కారణమైంది. పార్టీలో ఆయనకు ఎంతో ప్రాధాన్యమిచ్చినా, రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని అంతా ఆరా తీస్తున్నారు. ఇక రాజకీయమే వద్దన్న స్థాయిలో ఆయనకు విరక్తి తెప్పించిన అంశాలేంటనేది చర్చకు తావిస్తోంది. 1999లో తొలిసారిగా పోటీ చేసిన ఆళ్ల నాని…. మొత్తం మూడుసార్లు గెలిచారు. మూడు సార్లు ఓడారు. ఏలూరు నియోజకవర్గం వరకు ఆయనకు వైసీపీలో ఎదురులేదు. ఇం
కా చెప్పాలంటే ఏలూరులో ఎమ్మెల్యే స్థాయి నేతలు ఎవరూ ఆయనకు పోటీగా లేరు. అలా అని ఆయనకు ఓటములు కొత్తకాదు. కానీ, తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడానికి కారణమేంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు. ఐతే వైసీపీ ఓటమి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు…. గత ప్రభుత్వంలో తనను మంత్రిగా అర్ధాంతరంగా తప్పించడంపై అసంతృప్తితోనే నాని రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. 2019లో మంత్రిగా ప్రమాణం చేసిన ఆళ్ల నాని ఐదేళ్లు మంత్రి పదవిని ఆశించారు. కానీ, జగన్ ఆయనను మధ్యలోనే తప్పించేశారు.
భవిష్యత్‌పై ఆందోళన
ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు. ఐతే ప్రభుత్వ పదవి నుంచి తప్పించి… పార్టీ పని అప్పగించడంపై అప్పట్లోనే అసంతృప్తి చెందిన నాని…. వైసీపీ అధికారంలో ఉండటంతో ఎక్కడా బయట పడలేదు. ఇదే సమయంలో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ…. మరోవైపు ఉమ్మడి జిల్లాను క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ప్రస్తుతం బలంగా ఉండటం… ఇంకోవైపు నుంచి జనసేన తన బలాన్ని విస్తరిస్తుండటం వల్ల…. వైసీపీలో తన భవిష్యత్‌పై ఆందోళన చెందిన నాని రాజీనామా చేశారంటున్నారు.
మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా ఐదేళ్లు కార్యకర్తలను రక్షించుకోవడం, పార్టీ కార్యక్రమాలను చేయడం కూడా ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశమని భావించి…. తప్పుకోవడమే బెటర్ అన్న ఆలోచనతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఇదే సమయంలో ఎన్నికల ముందు… ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా మాజీ మంత్రి ఆళ్లను డిస్టర్బ్ చేశాయంటున్నారు. తన ప్రధాన అనుచరులుగా ఉన్నవారు…. తాను పార్టీలోకి తెచ్చి పదవులు కట్టబెట్టిన వారు సైతం పార్టీని వీడి వెళ్లిపోవడం, తాను ఒంటరి అయిపోతున్నాననే ఆలోచన…. ఆయనను రాజకీయాల నుంచి తప్పుకునేలా పురిగొల్పాయని అంటున్నారు.
ఐతే ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా, భవిష్యత్‌లో ఆయన మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైసీపీకి ఆళ్ల రాజీనామాతో ఏలూరులో ఆ పార్టీ పూర్తిగా క్లోజ్ అనే టాక్ మొదలైంది. ఇప్పటికే ఏలూరు నగర పార్టీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ గుడ్‌బై చెప్పగా, ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ ఈశ్వరి, మరికొందరు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు.
ఇక మేయర్ నూర్జహన్ కూడా నేడో.. రేపో రాజీనామా చేసేస్తారంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటితో మేయర్ సత్సంబంధాలు నెరుపుతున్నారట… ఇలా తన చుట్టూ ఉన్నవారంతా టీడీపీలోకి వెళ్లిపోతుండటం వల్ల నిరుత్సాహానికి గురైన నాని… వైసీపీకి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాలకే నమస్కారం చేశారంటున్నారు.
Also Read: ‘సుంకిశాల’ ప్రమాదంపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు