KTR: ‘సుంకిశాల’ ప్రమాదంపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు

సుంకిశాల ఘటనపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

KTR: ‘సుంకిశాల’ ప్రమాదంపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు

KTR

సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిస్పాక్షికంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని అడిగారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో తెలుపాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

కాగా, సుంకిశాల ఘటనపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఈ ప్రాజెక్టును హడావిడిగా చేపట్టడం వల్లే డిజైన్‌ లోపాలు, నాణ్యత లోపించి కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే గోడకూలిందని, పనులు కూడా రేవంత్ సర్కారు ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అవగాహనరాహిత్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.

సుంకిశాల వద్ద పరిస్థితులను ఇప్పటికే శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి, ప్రాజెక్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: దీని నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు: వైఎస్ జగన్