సీఎం చంద్రబాబు త్వరలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రుల పనితీరు బాగా లేదని చంద్రబాబు సీరియస్‌గా ఉండటంతో క్యాబినెట్ షఫ్లింగ్ పక్కా అంటున్నారు. దీంతో కొందరిని తప్పించి వారి స్థానంలో దూకుడుగా..విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.
అందులో నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చంద్రబాబు ఆశిస్తున్న క్వాలిటీస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఉన్నాయని, జగన్‌కు, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారని అంటున్నారు. ఈ సారి విస్తరణలో తమ నాయకునికి మంత్రి పదవి దక్కడం ఖాయమని కోటంరెడ్డి అనుచరులు సంబరపడిపోతున్నా రట. అటు ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలన, తెలుగుదేశం పార్టీపై మాజీ సీఎం చేసిన విమర్శలకు ఎక్స్ వేదికగా కౌంటర్లు ఇస్తూ..అధినేత దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట కోటంరెడ్డి.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సంచలన రాజకీయాలకు కేరాఫ్. అది స్వపక్షమైనా..ప్రతిపక్షమైనా ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరు అందరి కన్నా భిన్నంగా ఉండడంతో అతను ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వైసీపీ, జగన్‌తో విభేదించి..అధికారంలో ఉండగానే తిరుగుబావుట ఎగరవేశారు. టీడీపీలో చేరిన తర్వాత..లోకేశ్ యువగళం పాదయాత్రను సక్సెస్ చేసి తెలుగు యువతలో జోష్ పెంచారు కోటంరెడ్డి.
Also Read: ఆ ఇద్దరు చెబితేనే లీడర్లు కారు స్టార్ట్ చేస్తున్నారా? బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది?
టోటల్‌గా టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కోటంరెడ్డి తన వంతు కృషి చేశారని అంటుంటారు. వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే నెల్లూరు జిల్లాలోనూ ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టడంలో సక్సెస్ అయ్యారు కోటంరెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు కోటంరెడ్డి. విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారట కోటంరెడ్డి. ఇప్పటికే అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారట.
మంత్రి పదవి రేసులో తనపై వ్యతిరేకత రాకుండా..
కోటంరెడ్డి పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసించారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు..ప్రభుత్వం ఇచ్చే అసైన్‌మెంట్లను కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వస్తున్నారట. సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమాన్ని రికార్డ్ స్థాయిలో విజయ వంతంగా నిర్వహించి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నిలబెట్టారట ఎమ్మెల్యే కోటంరెడ్డి. అటు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలతోపాటు ఎంపీ వేమిరెడ్డి, ఇతర నాయకులు అందరిని కలుపుకుంటూ.. మంత్రి పదవి రేసులో తనపై ఎలాంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారట.
మరోవైపు టీడీపీ అధిష్టానంతో పాటు మంత్రి లోకేశ్‌తో కోటంరెడ్డి బ్రదర్స్‌కు మంచి సంబంధాలు ఉండటంతో ఈసారి కోటంరెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆల్రెడీ ఇద్దరు సీనియర్లు జిల్లా నుంచి మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి మరో మంత్రి పదవి నెల్లూరుకు వచ్చే ఛాన్స్ ఉండదు.
ఒకవేళ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం అనుకుంటే..ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు తమ పదవిని త్యాగం చేయక తప్పదు. కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణకు అమరావతి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. దాంతో ఆయనకు ఈ టర్మ్ మొత్తం బెర్త్ పక్కా అంటున్నారు. ఇక మిగిలి ఉంది ఆనం రామనారాయణరెడ్డి. ఆయన జగన్‌ను విబేధించి టీడీపీలో చేరి..కూటమి విజయానికి తన వంతు కృషి అందించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..ధాటిగా మాట్లాడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి కిరీటం దక్కుతుందో లేదో చూడాలి మరి..!