Kurnool Bus Accident
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బస్సు ప్రమాదంకు ముందు బైక్ పై నుంచి కిందపడి శివశంకర్ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బైక్ పై ఉన్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే, ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. తాజాగా.. ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నాడు. అతని ఫిర్యాదులోని వివరాలను పరిశీలిస్తే.. ‘బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్ ప్రమాదం జరిగింది. నేను, శివశంకర్ మద్యం సేవించాం. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.. శివశంకర్ స్పాట్ లో మృతి చెందాడు. నేను గాయపడి ప్రాణాలతో బయటపడ్డా. అయితే డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను.. తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది.. కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది’’ అని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు.. పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీలో డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఏ1గా వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ ను నిందితుడిగా పోలీసులు చేర్చారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బస్సుకు మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 19మంది సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు చిన్నారులు సహా మొత్తం 46మంది బస్సులో ఉన్నారు.