Kurnool Bus Accident
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది.
ఉల్లిందకొండ క్రాస్ వద్ద ముందు వెళ్తున్న బైక్ ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. బస్సు ప్రమాద సమయంలో 40మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి 20 మంది ప్రాణాలతో బయటపడగా.. 11 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరికొందరి మృతదేహాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటనలో 11 మృతదేహాలను వెలికి తీసినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, తమ వారి ఆచూకీ తెలియక ప్రయాణికుల బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
కలెక్టరేట్‌లో: 08518-277305.
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059.
ఘటనాస్థలి వద్ద: 91211 01061.
కర్నూలు పోలీసు స్టేషన్‌లో: 91211 01075.
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో: 94946 09814, 90529 51010.
ఒకే కుటుంబంలోని నలుగురి మృతి..
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గోళ్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది.
బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది హైదరాబాద్ కు చెందిన వాళ్లే ఉన్నారు.
డీఐజీ ఏం చెప్పారంటే..
బస్సు ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ .. ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని, 19మంది బస్సు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బైకు ఢీకొని మంటలు చెలరేగడం వల్ల ప్రమాదం జరిగిందని డీఐజీ చెప్పారు.