టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్
కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : March 14, 2024 / 12:42 PM IST
Kurnool MP Sanjeev Kumar: కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువాతో ఆయనను సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కర్నూలు అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు చెప్పారు. ఎలాంటి సీటు ఆశించకుండా బేషరతుగానే టీడీపీలోకి వచ్చానని వెల్లడించారు. తగు ప్రత్యామ్నాయం చూస్తానని తనకు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.
కర్నూలు ప్రాంతం నుంచి వలసలు, దారిద్య్రం నివారించలేకపోయాననే బాధ తనకు ఉందన్నారు. రెండు నదుల మధ్యలో ఉన్న కర్నూలుకు తాగు నీరు కూడా ఇవ్వలేనప్పుడు ఎంపీగా ఎందుకు కొనసాగాలని అనిపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక పరిధిలోని ఏడు స్థానాలు టీడీపీ గెలవబోతోందని సంజీవ్ కుమార్ జోస్యం చెప్పారు. కాగా, కర్నూలు టికెట్ నిరాకరించడంతో సంజీవ్ కుమార్ కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Also Read: చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తుకువస్తాయి?: జగన్
