Visakhapatnam Lok Sabha Seat : హాట్‌ సీటుగా మారిన విశాఖ పార్లమెంట్‌ స్థానం.. బరిలో ఉండేందుకు పోటీ పడుతున్న నేతలు

విశాఖ పార్లమెంట్ స్థానం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీటుగా మారింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచి పోటీ చేయటానికి రాజకీయ నేతలు పోటీ పడుతున్నారు.

Visakhapatnam Lok Sabha Seat

Visakhapatnam : విశాఖ పార్లమెంట్ స్థానం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీటుగా మారింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగాఉన్న విశాఖ నుంచి పోటీ చేయటానికి రాజకీయ నేతలు పోటీ పడుతున్నారు. విశాఖ ఎంపీ స్థానం గెలుపు పార్టీలకుకూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఈ స్థానంలో చావోరేవో తేల్చుకునేలా వార్ కు సిద్ధమవుతుండగా.. మరికొందరు నేతలుకూడా ఇక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే ఈ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. విజయనగరంకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి విశాఖ ఎంపీ బరిలోకి దిగుతున్నారు. గతంలో బొబ్బిలి ఎంపీగా బొత్స ఝాన్సీ ఎన్నికయ్యారు. అయితే, ఈసారి విశాఖలో ఆమె అడుగు పెడుతున్నారు. బొత్స సత్యనారాయణకుకూడా విశాఖలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి. వైసీపీకి కూడా విశాఖ ఎంపీ స్థానం కీలకం కావడంతో అనూహ్యంగా స్థానికురాలైన బీసీ మహిళలను ప్రకటించింది.

Also Read : Nara Lokesh Sankharavam Yatra : నారా లోకేశ్ శంఖారావం యాత్ర.. ఇచ్చాపురంలో ప్రారంభం.. కార్యకర్తలకు కీలక సూచన

రాష్ట్రంలో ఇటీవల మారుతున్న సమీకరణాలతో టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే కమలం పార్టీకే విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ టీడీపీ, జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో విశాఖ నుంచి పోటీ చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సిద్ధమవుతున్నట్లు సంకేతాలిస్తున్నారు. గతంలో విశాఖ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ఉండటంతో ఇక్కడి నుంచి మరోసారి బరిలోకి దిగాలని పురంధేశ్వరి ఆలోచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు విశాఖ సీటు తనదే అంటూ ప్రచారం చేస్తున్నారు.. ఇటీవల సంక్రాంతి సంబరాలు పేరుతో పెద్ద కార్యక్రమాన్నికూడా నిర్వహించారు. రిపబ్లిక్ వేడుకలతో జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరో బీజేపీ నేత సీఎం రమేష్ కూడా విశాఖ ఎంపీ స్థానంపై కన్నేశారని సమాచారం. త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో సీఎం రమేష్ విశాఖ స్థానం నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read : YSRCP: పలు పార్లమెంట్ నియోజక వర్గాలు, జిల్లాల కోఆర్డినేటర్లను నియమించిన వైసీపీ

పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తే.. గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ రంగంలోకి దిగాలని ఎప్పటినుంచో సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీ లీడర్ కేఏ పాల్ కూడా విశాఖ పార్లమెంట్ స్థానంపై కన్నేశారు. ఇటీవలే కొత్త పార్టీ ప్రారంభించిన జేడీ లక్ష్మీనారాయణ కూడా జై భారత్ పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీచేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా విశాఖ ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా విశాఖలో ఓటు బ్యాంక్ ఉండటంతో బలమైన వ్యక్తిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు