ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : మద్యం, డబ్బు పంపిణీ చేస్తే..మూడేళ్ల జైలు శిక్ష

  • Publish Date - March 7, 2020 / 12:37 AM IST

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార – విపక్షాలు రెడీ అవుతున్నాయి. జడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టాయి. అత్యధిక స్థానాలు గెలిచి .. ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని నిరూపించాలని వైసీపీ భావిస్తుంటే  స్థానిక సంస్థల్లో సత్తాచాటి ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో నిరూపించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC వేగంగా పావులు కదుపుతోంది. జిల్లా పరిషత్‌  పీఠాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. 13 జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 13 స్థానాలకు గానూ.. 7 స్థానాలను మహిళలు రిజర్వ్‌ చేశారు. కడప,  చిత్తూరు జెడ్పీ పీఠాలు జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. కర్నూలు –   జనరల్‌ , విజయనగరం – జనరల్‌, కృష్ణా జిల్లా – జనరల్‌ మహిళ, నెల్లూరు – జనరల్‌ మహిళ, ప్రకాశం –  జనరల్‌ మహిళ, పశ్చిమగోదావరి – బీసీ, శ్రీకాకుళం – బీసీ మహిళ, అనంతపురం – బీసీ మహిళ, విశాఖపట్నం – ఎస్టీ మహిళ, గుంటూరు –  ఎస్సీ మహిళ, తూర్పుగోదావరి  జెడ్పీ పీఠం ఎస్సీ కి రిజర్వ్‌ అయింది.

జెడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్థానిక సంస్థలను పూర్తిస్థాయిలో చేజిక్కించుకోవడానికి వ్యూహం పన్నారు సీఎం జగన్‌. ఇప్పటికే మంత్రులకు టార్గెట్లు ఫిక్స్ చేశారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రులకే ఎన్నికల బాధ్యత అప్పగించారు. ఎన్నికల్లో ఫలితాలు మెరుగ్గా లేకపోతే.. పదవులు ఊడతాయంటూ హెచ్చరించారు. పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లూ ఇవ్వబోమంటూ హెచ్చరించారు. అధికారపార్టీ నేతలను ఈ రేంజ్‌లో ప్రిపేర్‌ చేసిన సీఎం జగన్.. ప్రతిపక్షానికి మాత్రం ఊహించని ఝలక్ ఇచ్చారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తే … మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. అనర్హత వేటు వేస్తామంటూ ఆర్డినెన్స్ తెచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ముందే ప్లాన్ చేస్తోంది టీడీపీ. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసృంతృప్తి ఉందనే విషయాన్ని చాటి చెప్పాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా, పార్లమెంట్‌ స్థానాల వారీగా ఇంచార్జ్‌లను నియమించిన చంద్రబాబు.. యనమల, కళా వెంకట్రావు, వర్ల రామయ్య, లోకేశ్‌తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఒకవైపు ఎన్నికలకు సమాయత్తమవుతూనే.. మరోవైపు ఎన్నికల వాయిదా ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు చంద్రబాబు. రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే టీడీపీలోని బీసీ నేతలు సీఎం జగన్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికలు వాయిదా వెయ్యాలని ఆ లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల కమిషనర్ రమేశ్‌ కుమార్ సమావేశమయ్యారు. అంతకుముందు  కలెక్టర్లు, ఎస్పీలతో రమేశ్‌ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. బ్యాలెట్ పేపర్లతో స్థానికల సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కరెన్సీతో సమానమన్న ఎన్నికల కమిషనర్.. మద్యం, డబ్బులు, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేయడంపై స్పెషల్ ప్లానింగ్ తో ముందుకెళ్లాలని సూచించారు. 

See Also | మీ డబ్బులకు నేను హామీ :  నిర్మలా సీతారామన్ భరోసా