టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూమి లీజుకివ్వకుండా వైఎస్ జగన్‌కు సంబంధించిన సంస్థలకు ఇవ్వాలా? అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు టాటా సంస్థ కోసం తెచ్చిన 99పైసలకు ఎకరా కాన్సెప్ట్ ఇక్కడ ప్రవేశపెట్టాం. ఒకే ప్రభుత్వం కొనసాగడం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటంతో పాటు అభివృద్ధి జరుగుతుంది. సింగపూర్ అభివృద్ధికి ఇదే కారణం.
రాష్ట్ర ప్రజలూ ఒకే ప్రభుత్వం కొనసాగింపు వల్ల జరిగే ప్రయోజనాలపై ఆలోచనలు చేయాలి. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాన్ని ఆ రాష్ట్రం వరకే పరిమితం చేస్తారు. ఇతర ప్రాంతాలకు వెళ్తే.. రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తారు. కానీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలోనే ఉన్నాయి. వైసీపీ ఈ-మెయిళ్ల కుట్ర ఆగడం లేదు.
సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో ఉండగానే ఏపీపై దుష్ప్రచారం చేస్తూ కొందరు తప్పుడు మెయిళ్లు చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ పెద్దిరెడ్డి అనుచరుడు ఈ మెయిళ్లు పెట్టారు.
పెద్దిరెడ్డి సంస్థ పీఎల్ఆర్ సంస్థతో సంబంధం ఉన్న మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ మెయిళ్లు పెట్టినట్టు గుర్తించాం. మేం అక్కడ ఉండగానే మురళీ కృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులకు ఈమెయిళ్లు పెట్టారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం లేదని.. ఒప్పందాలు కుదుర్చుకోవద్దని ఆ దేశ మంత్రులకు మెయిల్స్ పెట్టారు. ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. మేమంతా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో పరుగులు పెడుతోంటే.. ఈ విధంగా జగన్ తప్పుడు మెయిళ్లు పెట్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాన్ని ఆ రాష్ట్రానికే పరిమితం చేస్తారు” అని అన్నారు.