సుప్రీంకోర్టు సూచనలతో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ పది అసెంబ్లీ సెగ్మెంట్లకు బైపోల్స్ రావడం పక్కానా?
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ ఎపిసోడ్ మన రాష్ట్రంలోనే కాదు..నేషనల్ టాపిక్ అవుతోంది.

మరోసారి తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్‌తో..ఆ మందిపై వేటు ఖాయమన్న టాక్ బయలుదేరింది. బీఆర్ఎస్‌లో గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఈ సారి కాస్త క్లియర్ కట్ డైరెక్షన్సే ఇచ్చింది. మూడు నెలల్లోపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు స్పష్టం చేసింది సుప్రీం.
ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో కోర్టు టైం బాండ్ ఫిక్స్ చేయడంతో..స్పీకర్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కూడా..అసెంబ్లీ కార్యదర్శిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో..స్పీకర్ ఆఫీస్‌కు గతంలోనే నోటీసులు జారీ చేసింది కోర్టు. ఇప్పుడు సుప్రీం ఉత్వర్తులతో బంతి మరోసారి స్పీకర్ కోర్టులోకి వచ్చింది.
Also Read: బిజినెస్‌కు గుడ్‌బై..ఇలా హర్ట్ అయితే ఎలా వేమిరెడ్డి..?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురి విషయంలో సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి..పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీ కంటెస్ట్ చేశారు. దీంతో ఫిరాయింపు విషయంలో దానం నాగేందర్ క్లియర్‌గా దొరికిపోయినట్లు అయింది. ఇక మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం చేశారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంకట్రావు ప్రచారం చేసిన వీడియోలు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఫిరాయింపుల పరిధిలోకి రావడం ఖాయమంటున్నారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బలపరుస్తూ బీఫామ్‌పై సంతకం చేశారని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఈ విధంగా కడియం శ్రీహరి కూడా ఫిరాయింపుల పరిధిలోకి వస్తారని చర్చ జరుగుతోంది. ఇక మిగతా ఏడు మంది ఎమ్మెల్యేలు మాత్రం..ఫిరాయింపుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో తాము చేరలేదని కేవలం దేవుడి కండువా మాత్రమే కప్పుకున్నామంటూ చెప్పుకొస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ స్పందన ఇదే..
కోర్టు చెప్పిన ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో ఎమ్మెల్యేలపై వేటు వేసిన అంశం చర్చకు వస్తోంది. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్‌తో స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదని అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇదిలా ఉంటే..కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో 2014 నుంచి జరిగిన వాటన్నింటిపైన చర్చ జరగాలంటూ కొత్త మెలిక పెడుతోంది. ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోని అంశమని చెప్తూ కవర్ చేస్తోంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సుప్రీంకోర్టు కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. న్యాయస్థానం సూచనలపై న్యాయ సలహా తీసుకుని డెసిషన్ తీసుకుంటానంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఎటువైపు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు సూచనల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ ఆ పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా.? లేక సీరియస్ అలిగేషన్స్ ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకుంటారా.? అసలు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అతిపెద్ది సెమీఫైనల్ ఫైట్ రావడం పక్కా. కనీసం ముగ్గురి మీద యాక్షన్ తీసుకున్నా..తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కడం కూడా ఖాయం. ఒకవేళ స్పీకర్ సుప్రీం డైరెక్షన్స్‌ను లైట్ తీసుకుంటే న్యాయస్థానం మూడు నెలల తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
అప్పటికీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై డెసిషన్ తీసుకోకపోతే..సుప్రీం ఏం చేయబోతుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ ఎపిసోడ్ మన రాష్ట్రంలోనే కాదు..నేషనల్ టాపిక్ అవుతోంది. స్పీకర్ వేటు వేసినా..వేయకున్నా..సుప్రీం ఇన్వాల్వ్ అయినా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ హాట్ టాపిక్ కొనసాగుతూనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఈ మూడు నెలల్లో అయినా ముగింపు లభిస్తుందా లేదా అనేది చూడాలి మరి.