Mahashivaratri
Mahashivaratri : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శైవక్షేత్రాల్లో శివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీశైలం జనసంద్రంగా మారింది.
మల్లన్న దంపతులను దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి శివ భక్తులు భారీగా తరలి వచ్చారు. కాలి నడకన వచ్చే వారితోపాటు సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలి వచ్చిన వారి సంఖ్య లక్ష మందికి పైగా ఉంటుందని చెబుతున్నారు. భక్తులు తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మెక్కులు తీర్చుకుంటున్నారు.
Maha Shivratri 2022 : మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా….!
శ్రీగిరులపై మహా శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు సాయంత్రం స్వామివారి భ్రమరాంబ అమ్మవారితో కలిసి గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమాలు నిర్వహించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.
సాయంత్రం ప్రత్యేకంగా అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మంగళ వాయిదాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగగా.. భక్తులు నీరాజనం పట్టారు. శోభాయాత్రలో చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, శేషధారణలు, గొరవనృత్యం, నందికోలసేవ తదితర విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
Maha Shivaratri: తిరుపతి మహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం
ఉత్సవం అనంతరం కాళరాత్రి పూజ, మంత్రపుష్పంతో పాటు ఆస్థాన సేవ నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్పవాల్లో మార్చి 2న రథోత్సవం జరుగనున్నది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం రథోత్సవ కలశానికి మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి, అనంతరం రథ శిఖరానికి అలంకరించారు.