Mandous Cyclone Effect.. Snow fog in Tirumala
Tirumala : తిరుమల గిరులు హిమ గిరులుగా మారాయి. మంచు కమ్మేసిన తిరుమల కొండలను కూడా భక్తులు పరవశించిపోతున్నారు. ఫోటోలు..వీడియోలు తీసుకుంటూ మురిసిపోతున్నారు. మాండౌస్ తుఫాను ప్రభావంతో తిరుపతి,తిరుమలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మంచు పొగ కమ్మేసి తిరుమల దివ్యక్షేత్రం అంత ప్రకృతి రమణీయతతో పులకించిపోతోంది. తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులు ఓ వైపు చలి కొరికేస్తున్నా..మంచులో తడిచి ముద్దవుతున్న తిరుమల కొండలను కూడా మురిసిపోతున్నారు. తెల్లని పొగమంచు తెరలనడుమ తిరుమల కొండలు ఎంతో అందంగా అద్భుతంగా దర్శమిస్తున్నాయి. ఇవి శేషగిరులా? లేక పరమేశ్వరుడు కొలువైన కైలాస పర్వతమా? అని తన్మయత్వం చెందుతున్నారు.
చల్లచల్లన మలయవీచికలు గిలిగింతలు పెడుతుంటే భక్తులు పరవశించిపోతున్నారు.తిరుమల కొండలపై మంచుకొండల్ని దర్శించుకున్న మధురానుభూతికి లోవనవుతున్నారు శ్రీవారి భక్తులు. మాండౌస్ తుఫాను ప్రభావంతో తిరుమలలో మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అసలే శీతాకాలం..దానికి తోడు వర్షం వెరసి పొగమంచులో దోబూచులాడుతున్నాయి తిరుమల గిరులు. హిమపాతంతో తిరుమల గిరులు కశ్మీర్ లో మంచుకొండలను తలపిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని పుణ్యతీర్థాలు, జలపాతాలు జలకళతో ఉట్టిపడుతుంటే ఆ అందాలు చూసి భక్తులు పరవశించిపోతున్నారు.