గోడలో ఇమిడి నీడ ఇస్తున్న మామిడి చెట్టు, వృక్షో రక్షతి రక్షితః అంటే ఇదే కదా

‘వృక్షో రక్షతి రక్షితః’ అంటే.. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని అర్థం. ప్రకృతిని పచ్చగా, ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉన్నదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొదట మొక్కలుగా ఉన్నా, ఆ తర్వాత వీటిలో చాలావరకు

Mango Tree In Wall

Mango tree in wall : ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటే.. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని అర్థం. ప్రకృతిని పచ్చగా, ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉన్నదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొదట మొక్కలుగా ఉన్నా, ఆ తర్వాత వీటిలో చాలావరకు వృక్షాలుగా, మహావృక్షాలుగా రూపాన్ని సంతరించుకుంటాయి. కార్బన్‌డై ఆక్సైడ్ ను పీల్చుకుని, మనకేగాక, పశుపక్ష్యాదులకు అత్యవసరమైన ప్రాణవాయువునందిస్తూ త్యాగానికి మరో పేరుగా చెట్లు అలరారుతున్నాయి.

అలసిన మనసునకు చల్లని నీడనిచ్చి, చక్కని ప్రశాంతతను కలిగింపచేస్తాయి చెట్లు. అంతేకాదు రసవంతమైన ఫలాలనందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు అంగరక్షకులుగా వ్యవహరిస్తాయి. భూతాపాన్ని అరికడతాయి. భూసారాన్ని పెంచుతాయి. వర్షాల రాకకు కారకాలై కరువు రక్కసిని పారద్రోలుతాయి. పసిడి పంటలతో వసుధను పరవశింపచేస్తాయి. గృహాలకు అత్యంత ఉపయోగకరమైన ఉపకరణాలుగా మారతాయి. ఇలా ఎన్నో విధాలుగా చెట్లు ఉపయోగపడతాయి.

ఈ సత్యాన్ని గ్రహించిన తిరుపతి వాసి.. తన ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్నా.. ఆ మామిడి చెట్టుని తొలగించ లేదు. ఆ చెట్టుకి ఇబ్బంది కలగకుండా తనకూ సమస్య రాకుండా తెలివిగా నిర్మాణం చేశాడు. తిరుపతి బాలాజీ కాలనీ అండర్‌ బ్రిడ్జి నుంచి ఎంఆర్‌పల్లికి వెళ్లే మార్గంలో ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టును తొలగించకుండా చెట్టు కాండం గోడలోకి ఇమిడిపోయే విధంగా నిర్మాణం చేశాడు. నీడను, మామిడి పండ్లను ఇచ్చే చెట్టును తొలగించడం ఇష్టం లేక ఇలా చేసినట్లు యజమాని తెలిపాడు. గోడ నుంచి చెట్టు వచ్చినట్లు కన్పిస్తుండటంతో జనాలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

చిన్న చిన్న విషయాలో ఈ రోజుల్లో చెట్లను నరికేస్తున్నారు. నిర్మాణానికి అడ్డంగా ఉందనో, కరెంట్ వైర్లకు తగులుతుందనో, చీకటిగా ఉంటుందనో.. ఇలా పలు కారణాలతో చెట్లను అడ్డంగా నరికేస్తున్నారు. ఆ ఇంటి యజమాని మాత్రం చెట్టు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని నడుచుకున్నాడు. చెట్లు ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం అని గ్రహించాడు.