Medico Priyanka : మెడికో ప్రియాంక మృతి.. చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌.. నిందితులను వదిలిపెట్టమన్న సీఎం

Medico Priyanka : మెడికో ప్రియాంక మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Medico Priyanka

Medico Priyanka : మెడికో ప్రియాంక మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 6 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక మృతి చెందడం తనను కలిచివేసిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

గద్వాల జిల్లా ఐజాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలో పీజీ వైద్య విద్య చదువుతోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో వేగంగా వచ్చిన కారు ఆమె స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. బెయిన్ డెడ్ తో మృతిచెందినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Read Also : CJI Nalsar Students : నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ వద్దు.. 450 మంది విద్యార్థుల తీవ్ర అభ్యంతరం!

ఈ ఘటనను పోలీసులు ప్రమాదమా? లేదా ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే, దశ్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్స్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఉద్దేశపూర్వకంగా ప్రియాంకను ఢీకొట్టినట్లు నిర్ధారణ అయితే హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలకమైన హామీ ఇచ్చారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అన్నారు. వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు.. హోంమంత్రి అనిత కూడా ఘటనపై ఆరా తీశారు. ప్రియాంక తండ్రి వెంకటేష్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత హామీ ఇచ్చారు.