Chiranjeevi CM Jagan : సీఎం జగన్‌ నిర్ణయాన్ని ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి

ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. అంతేకాదు ధన్యవాదాలు కూడా చెప్పారు. మ్యాటర్ ఏంటంటే..

Chiranjeevi CM Jagan : ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. అంతేకాదు ధన్యవాదాలు కూడా చెప్పారు. మ్యాటర్ ఏంటంటే.. సీఎం జగన్ గురువారం(మార్చి 25,2021) కర్నూలు ఎయిర్ పోర్టుని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు.

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేయడం పట్ల టాలీవుడ్ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ సీఎం జగన్‌ కు ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. ఇది భారతదేశపు తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడకు ఇచ్చిన అతిపెద్ద, ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన పాత్రని స్క్రీన్‌పై పోషించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చిరు చెప్పారు. ఇక చిరంజీవి .. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను చూసి అప్పట్లో సీఎం జగన్.. చిరంజీవి నటనను మెచ్చుకున్న విషయం విదితమే. కాగా, ఉయ్యాలవాడ పాత్రలో నటించాలని కెరీర్ తొలినాళ్ల నుంచి చిరంజీవి కలకన్నారు. ఎట్టకేలకు 2019లో తన కోరిక నెరవేర్చుకున్నారు. సైరా నరసింహారెడ్డి పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

గతంలో తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు కలిగించే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి ఫోన్‌లో చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో తొలిసారి పూర్తి స్థాయిలో తనయుడు రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. ఏప్రిల్ నుంచి ‘లూసీఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు వేదాలం సినిమాను కూడా కంప్లీట్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఎయిర్ పోర్టుని ప్రారంభించిన సీఎం జగన్.. కర్నూలు జిల్లా చరిత్రలో ఇది గొప్పరోజు అని అన్నారు. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో ఒకేసారి 4 విమానాలు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని సీఎం జగన్​ తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో ఆరోదని తెలిపారు. న్యాయ రాజధానిని మిగతా రాష్ట్రాలతో ఓర్వకల్లు కలుపుతుందన్నారు.

మార్చి 28 నుంచి కర్నూలు విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఉడాన్‌ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ సర్వీసెస్ నడపనుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నైకు రెండేళ్ల పాటు ఇండిగో సంస్థ విమాన సర్వీసులు నడపనుంది.

ట్రెండింగ్ వార్తలు