AP Rains: ఏపీలో నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు..

AP Rains

AP Rains: ఏపీలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. కేరళను తాకిన రెండు రోజుల్లోనే ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

 

బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా గంటకు 60 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈదురు గాలులు ప్రబావంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. ఈనెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

మంగళవారం అనంతపురం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాల్లో.. బుధవారం అనంతపురం, కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్టా, ఏలూరు, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.