AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
AP Rain Alert : ఈశాన్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. నేడు క్రమంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని ప్రభావంతో తీరంవెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harishth Thanniru
- Published On : February 24, 2026 / 10:32 AM IST
AP Rain Alert
- నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- ఈశన్య దిశగా కదులుతు నేడు బలహీన పడనున్న అల్పపీడనం
- ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే చాన్స్
AP Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు కారణం అవుతున్నాయి. గత వారం రోజుల క్రితం రెండు అల్పపీడనాలు ఏర్పడగా.. ఇందులో ఒక అల్పపీడనం ఇప్పటికే బలహీనపడింది. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతోపాటు.. ఈ అల్పపీడనానికి ఉపరితల ద్రోణి కూడా తోడుకావడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈశాన్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. నేడు క్రమంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని ప్రభావంతో తీరంవెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగా ఏపీలోని విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోని పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.
సోమవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా సాలూరులో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. ఇప్పటికే వేసవి ప్రారంభంకావడంతో ఎండల తీవ్రత పెరుగుతోంది.. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డారు.
అయితే, సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు. మంగళ, బుధవారాల్లో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
