Minister Ambati Rambabu's sensational comments on the sitting MLA ticket
Andhra Pradesh : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి టికెట్ దక్కుతుంది, ఎవరికి దక్కదనే విషయంపై వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వైనాట్ 175 అంటున్న సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయ కేతనం ఎగురవేయటంతో ఆత్మరక్షణలో పడినట్టుగా కనబడుతోంది. గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు సాధించి ఎదురులేని విజయంతో ఉన్న వైసీపీ ఇప్పుడు చేజారిపోతున్న ఎమ్మెల్యేలు.. అసంతృప్తి రాగం అందుకుంటున్న ఎమ్మెల్యేలతో తలపట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే సీటు ఇచ్చేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కుతుందో చెప్పటం కష్టమన్నారు. గెలిచే అవకాశాలున్నవారికి మాత్రమే టికెట్ ఇస్తానని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. కష్టపడే వారికి మాత్రమే టిక్కెట్లు లభిస్తాయని స్పష్టం చేశారు. గెలిచే అవకాశాలు లేకపోతే మంత్రులకు కూడా టిక్కెట్లు రావని వెల్లడించారు. ఒకవేళ గెలిచే అవకాశం లేకపోతే తనకు కూడా టిక్కెట్ ఇవ్వననే జగన్ చెబుతారని పేర్కొన్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అంబటి అన్నారు. సత్తెనపల్లిలో కొందరి విషయం అధిష్టానం చూసుకుంటుందని హెచ్చరించారు. ఈ నెల 7 నుంచి జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయన్నది ప్రచారం మాత్రమేనని అన్నారు.
Also Read: పవన్, బాలకృష్ణతో తిరిగి మాపై చంద్రబాబు సినిమా డైలాగులు వదులుతున్నారు
తాడేపల్లి వేదికగా సీఎం జగన్ అధ్యక్షతన నేడు కీలక సమావేశం నేపథ్యంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల గురించి ఈ భేటీలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు.