దువ్వాడతో జగన్ రాజీనామా చేయించాలి, టీటీడీలో అక్రమాలపై విచారణ- మంత్రి ఆనం

అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? విల్లా కొనుక్కోవాలని కమీషనర్ ని పర్మిషన్ అడిగింది.

Anam Ramanarayana Reddy (Photo Credit : Google)

Anam Ramanarayana Reddy : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ కు కుటుంబం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే వదిలేయాలన్నారు. వైస్ జగన్ మోహన్ రెడ్డి గౌరవంగా దువ్వాడతో రాజీనామా చేయించి ఆయనను ఇంటికి పంపితే వైసీపీకి కూడా గౌరవం ఉంటుందన్నారు. శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా లేకపోతే జగన్ రాజీనామా చేయిస్తాడా? అని మంత్రి ఆనం ప్రశ్నించారు.

”రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వైసీపీకి సమాధి కట్టారు. ఇక పుష్పగుచ్చం ఎవరు గుచ్చాలన్నదే మిగిలింది. పెద్దల సభలో ఉన్న వారే ఈ మధ్యకాలంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రేపు పెద్దల సభలోకి దువ్వాడ శ్రీనివాస్ ఏ మొహం పెట్టుకుని వచ్చి సమాధానం చెబుతారు” అని మంత్రి ఆనం నిలదీశారు.

”గ్రీవెన్స్ సెల్ కి ఎక్కువ దేవాదాయశాఖకు సంబంధించిన సమస్యలు వచ్చాయి. గ్రీవెన్స్ సెల్ ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వ కార్యాలయాల్లో కంటే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లోనే ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి. అనేక సమస్యలకు గ్రీవెన్స్ సెల్ ద్వారా పరిష్కారం దొరికింది. దేవాదాయశాఖ ఆస్తులు అన్నింటిని గుర్తించాం. సెక్షన్ 22a1c కింద 6,40,000 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించాం.
1,50,000 ఎకరాలు ధూప, దీప నైవేద్యం కింద భూములు ఇచ్చాం. అవి కూడా కొన్ని అన్యాక్రాంతం అయ్యాయి. టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. గతంలో ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి తిరుమలలో అక్రమాలకు పాల్పడ్డారు. గడిచిన ఐదేళ్లలో తిరుమలలో జరిగిన అక్రమాలపై త్వరలోనే ఒక నివేదిక వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాం.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత దోపిడీ జరిగిందో నిజానిజాలు నిగ్గు తేలుస్తాం. అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? విల్లా కొనుక్కోవాలి అని కమీషనర్ ని పర్మిషన్ అడిగింది. అన్నీ తానై తన శాఖ పరిధిలో లేని పనులు కూడా చేసింది. అక్రమాస్తులు ఉన్నాయన్న కారణంతో శాంతిని సస్పెండ్ చేశాం. పూర్తి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించాం. ప్రేమ సమాజ భూముల మీద ప్రేమ పుడుతుంది అనుకోలేదు. కొంతమంది దుష్టుల చేరి ప్రేమ సమాజం పేరును భ్రష్టు పట్టించారు” అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు.

Also Read : వైఎస్ జగన్‌ను జైల్లో వేయాలి..!- హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు