Nara Lokesh
Group-2 Exam : ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఈనెల 23న మెయిన్స్ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే, పరీక్షలను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థుల నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పరీక్ష జరగడానికి కేవలం ఒక్కరోజు మిగిలి ఉన్న సమయంలో లోకేశ్ స్పందించడంతో అభ్యర్థులు ఓ మేర ఊరట చెందుతున్నారు.
మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘గ్రూప్ 2 అభ్యర్థుల నుండి పరీక్షలను వాయిదా వేయమని నాకు చాలా అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను నేను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారం కనుగొనడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తాము.’’ అని తెలిపారు.
I’ve received numerous requests from Group 2 aspirants to postpone the examinations. I understand their concerns and, in consultation with our legal teams, we will explore all possible avenues to find a solution.
— Lokesh Nara (@naralokesh) February 21, 2025
రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించొద్దని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించకపోతే ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుందని వాపోతున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలున్నాయని, వీటిని సరిచేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందిచాలని కొద్దిరోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు.
రాష్ట్రంలో 899 పోస్టులు భర్తీ చేసేందుకు 2023 డిసెంబర్ 7వ తేదీన గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ ఆగిపోయింది. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న (ఆదివారం) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఇందుకోసం 13 ఉమ్మడి జిల్లాల్లో 175 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రేపు జరగనున్న నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ.. అభ్యర్థుల డిమాండ్ కు అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.